పుట:Abaddhala veta revised.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిగిలినవన్నీ సూచనమాత్రంగా తీసుకోవాలేగాని, వాస్తవంగా భావించరాదంటాడు. ఇస్లాంకు, క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా వచ్చిన ఆర్యసమాజం, దయానందుడి నాయకత్వాన దేశాన్ని కొంత మేరకు వెనక్కు నడిపించింది.

- హేతువాది, మే 1989
పునర్వికాస పరిణామం
ముందు స్వాతంత్ర్యం-తరువాత సంఘ సంస్కరణ

భారతదేశంలో పునర్వికాస ఛాయలు ముందుగా బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలలో కనిపించాయి. బెంగాల్, మద్రాసు, బొంబాయి రాష్ట్రాలలో కొత్త ఆలోచనలు వచ్చాయి. అలా మార్పుకు గురైన ప్రాంతాలలో మహారాష్ట్రను ప్రధానంగా పేర్కొనాలి.

మహారాష్ట్రలో బొంబాయి,పూనాలు చైతన్య కేంద్రాలుగా వుండేవి. మహారాష్ట్ర అంతటా హిందువుల సంఖ్య అత్యధికం. 88.5 శాతం హిందువులు కాగా, యిందులో బ్రాహ్మణులు కేవలం 45శాతమే వుండేవారు. వీరే మహారాష్ట్రలో 19శతాబ్దం చివర భాగంలోనూ, 20వ శతాబ్దం మొదట్లోనూ అన్ని రంగాలలో పెత్తనం చేశారు. 40 శాతం వున్న మరాఠీలు సమాజంలో మూగవారుగానే సేవలు చేశారు. వీరు ప్రధానంగా వ్యవసాయదారులు. అటు గ్రామ జీవితంలోగాని, ఇటు పట్టణ నాగరికతలో గాని సాంస్కృతిక, విద్యా, కళా రంగాలలో బ్రాహ్మణులే ఆధిపత్యం చేశారు.

బ్రాహ్మణులలో మళ్ళీ దేశస్థులనీ, చిత్ పవనులనీ రెండు శాఖలున్నాయి. బ్రాహ్మణులలో దేశస్థులు 45 శాతం వుండగా, చిత్ పవన బ్రాహ్మణులు 55వ వంతు వున్నారు. బ్రాహ్మణుల గురించి, అందునా చిత్ పవన శాఖ వారిని గురించి ప్రస్తావించవలసి వచ్చిందంటే, సామాజిక రంగంలో వారి ప్రాధాన్యత అంతగా వుందన్నమాట. చిత్ పవన శాఖ వారిలో 80 శాతం పూనాలో వుండేవారు. వీరు కట్టుగా వుంటూ తమ ఆధిపత్యాన్ని విస్తరింపజేసుకున్నారు. వీరికి శంకేశ్వర శంకరాచార్యుడు గురువు. ఆయనే వీరి కలహాలు తీర్చేవారు. మరాఠా సామ్రాజ్యంలో వార్తాహరులుగా పనిచేసిన చిత్ పవన బ్రాహ్మణులు ప్రభుత్వ రంగంలో అన్ని శాఖలలో విస్తరించారు. చివరకు పీష్వాలయ్యారు. ప్రభుత్వాలు వీరి సేవలకు బహుమానంగా మడులు మాన్యాలు యిచ్చి, పన్ను మినహాయించి సత్కరించాయి. బ్రిటీష్ వారి చేతుల్లో ఓడిపోయిన షీష్వాలు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా పారిపోయారు. అది వారి సమయస్ఫూర్తికి, చతురతకూ నిదర్శనం. సాహిత్య, పౌరోహిత్య, సామాజిక రంగాలలో పెత్తనం మాత్రం తిరుగులేకుండా యీ బ్రాహ్మణులు నిర్వహించారు.

బ్రిటిష్ పాలనలో ముందుగా ఇంగ్లీషు చదువులు మొదలెట్టింది బ్రాహ్మణులే. బొంబాయి, పునా ఇంగ్లీషు పాఠశాలలు, కళాశాలల్లో బ్రాహ్మణులే అత్యధికంగా వుండేవారు.