పుట:Abaddhala veta revised.pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచారవ్యవహారాలు చాలా హెచ్చు. ఉపవాసాలూ అంతే. అలాంటి ఒక సందర్భంలోనే మూలశంకరుడికి విగ్రహాల ప్రభావంపై అపనమ్మకం ఏర్పడింది. శివలింగంపై ఎలుకలు తిరగడంచూచి అలాంటి విగ్రహానికి విలువ ఏమిటని చేస్తున్న ఉపవాసం కాస్తా మూలశంకరుడు విరమించాడని ప్రతీతి. తల్లిదండ్రులకు యీ విషయం కోపంకూడా వచ్చిందట. అలా ఆలోచించిన మూలశంకరుడు తన ఆలోచనను తార్కికంగా విస్తరిస్తే ఎంతో ప్రయోజనం చేకూరేది. ఆ తరువాత మూలశంకరుడు గుజరాత్ లోని కౌషియాలో మతవిజ్ఞానం ఆర్జించాడు. అప్పటికే సన్యాసించాలనే భావన ప్రబలినట్లున్నది. తల్లిదండ్రులు పెళ్ళి తలపెడితే, మూలశంకరుడు తప్పించుకొని పారిపోయాడు. తండ్రి వెంటపడి, కుమారుని సన్యాసి కాకుండా సంసారిని చేయాలనే ప్రయత్నం విఫలమైంది.

19వ ఏటనుండే మూలశంకరుడు ఆశ్రమాలకు, సన్యాసులవద్దకు వెళ్లడంతో అతడి లక్ష్యం నిర్ధారణ అయింది.

మూలశంకరుడి పేరుమార్చి దయానంద అని నామకరణం చేసినవారు పరమానందుడు. ఆ తరువాత వివిధ ప్రదేశాలలో యోగాభ్యాసం, సంస్కృత వ్యాకరణం, తాంత్రిక విద్య కూలంకషంగా నేర్చాడు. వివిధ మఠాల తీరుతెన్నులు పరికించాడు. 1860 నాటికి విరాజానందస్వామి వద్దకు (మధుర) చేరాడు. అప్పటికి మూలశంకరుడికి 36 సంవత్సరాలు. అంధుడైన విరాజానందవద్ద మూడేళ్ళపాటు శుశ్రూషచేసి చాలా నేర్చుకున్నాడు. 1863 నుండి 75 వరకు దయానందుడు ఉత్తరాదిలో నిర్విరామంగా పర్యటించాడు. సుమారు 50 మత సమావేశాలలో పాల్గొని, చర్చలు జరిపి, వేదికలపై సనాతనులతో పోటీపడి, తనదే పైచేయి అనిపించుకున్నాడు.ఇంచుమించు 40 వివాదాస్పద సభలలో దయానందుడు తన వాదనా పటిమను నిరూపించాడు. వీటిలో కొన్ని క్రైస్తవుల, ముస్లింల సభలు కూడా వున్నాయి. హిందూమతంలో వేదేతరంగా జరిగే వాటిని ఎదుర్కొన్నాడు. వేదాలకు భాష్యం చెప్పాడు.

దయానందుడు తన మత ప్రచార పర్యటనలో బ్రహ్మసమాజవాదులైన కేశవచంద్రసేన్, దేవేంద్రనాద్ ఠాగోర్లను కలిశాడు. క్రైస్తవ మత ప్రభావం బ్రహ్మసమాజ్ పై ఎక్కువగా వున్నదని అభిప్రాయపడ్డాడు. గోవిందరనడే, ఆర్.జి. భండార్కర్లతో చర్చలు జరిపారు. ప్రార్ధనాసమాజ్ వారిని కలిశారు. ఇలా ప్రచారం సాగిస్తుండగా, దయానందుని పేరు అమెరికా వరకూ ప్రాకింది. దివ్యజ్ఞాన సమాజస్థాపకులైన బ్లావట్ స్కీ, ఆల్కాట్ లు తమ సంఘాన్ని దయానంద్ స్థాపించే ఆర్యసమాజ్ తో విలీనం చేస్తామన్నారు. ఆయన అందుకు అంగీకరించారు. 1879లో వారు భారతదేశానికి వచ్చి అనుకున్న ప్రకారం తమ సమాజ్ ను ఆర్యసమాజ్ తో కలిపారు. కాని ఆ సంయోగం అట్టేకాలం నిలువలేదు. 1881 లో విభేదాలతో వారు వేరయ్యారు.

1874 లో దయానందుడి సత్యార్థ ప్రకాశిక రచన వెలువడింది. తొలి ప్రచురణలో గోమాంసం సైతం కొన్ని పరిమితులలో తినవచ్చన్నాడు. ద్వితీయ ముద్రణ నాటికి ఆ అభిప్రాయం