పుట:Abaddhala veta revised.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారంతా వేదాల్ని శిరసావహించారు. అయితే వేదాలకుతోడు ఉపనిషత్తులకు సైతం ప్రమాణాన్ని ఆపాదించారు. మరికొందరు గీతనుకూడా ప్రమాణంగా స్వీకరించారు. హిందువులకు దూరంగా జరిగిన జైనులు, బౌద్ధులు మాత్రం వేదాల్ని ఒప్పుకోలేదు. చార్వాకుడు స్పష్టంగా వేదాల్ని తృణీకరించాడు. షడ్డర్శనకారులందరూ వేదప్రమాణాన్ని అంగీకరిస్తూనే, ఒకర్ని మరొకరు నిరసించి, పూర్వ పక్షం చేయడానికి ప్రయత్నించారు. మేం చెప్పేదే వేదాలకు అనుకూలంగా వున్నదని రుజువు చేయడానికి తర్కాన్ని ప్రయోగించారు.

దయానందుడు బయలుదేరేనాటికి భారతదేశం విదేశీ పాలకులందరినీ చవిచూసింది. ముస్లింపాలన అంతమై ఇంగ్లీషువారి పాలన స్థిరపడింది. బ్రిటిష్ వారు దేశీయుల మతం, సాంఘిక ఆచారాల జోలికి పోరాదని అధికార విధానంగా భావించారు. కాని ఇంగ్లీషు విద్యల ప్రభావంతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, పునర్వికాసం మొదలైన భావాలు పరిమితంగా ప్రభావితం చేశాయి. యూరోప్ నుండి వచ్చి మిషనరీలు మారుమూల గ్రామాలకు సైతం వెళ్ళి మతమార్పిడులు చేశారు. క్రైస్తవులుగా మారినవారిలో ఎక్కువమంది అంటరాని వారుండడం గమనించాలి. అక్కడక్కడా కొద్దిమంది శూద్రకులాలవారు, చెదురుమదురుగా అగ్రకులాలవారు క్రైస్తవులయ్యారు. బ్రహ్మసమాజీకులపై క్రైస్తవ ఆలోచనా ప్రభావం బాగా వున్నది. వెనువెంటనే సనాతన పండితులు మతమార్పిడిని నిరసిస్తూ, ఈసడిస్తూ పోయారు.

దేశంలో ముస్లింలుగా మారడం అప్పటికే యించుమించు పూర్తి అయింది. వందలాది సంవత్సరాల ముస్లిం పాలనలో యీ మార్పిడి జరిగిపోయింది. ఇందులోనూ తక్కువ కులాల నుండి ఎక్కువగా ఇస్లాంలోకి మారగా, పదవులు-హోదాలు ఇత్యాది కారణాల రీత్యా అగ్రకులాలలో కొందరు ముస్లింలుగా మారారు.

హిందువులలో తక్కువ కులాలవారిని నీచంగా చూడడం, అంటరానివారిని పశువులుగా పరిగణించడం శతాబ్దాలుగా వస్తున్నది. మత ధర్మశాస్త్రాలు యి ధోరణిని సమర్ధించాయి. అలాంటి హిందూ వ్యవస్త నుండి మతమార్పిడి జరిగింది. ఇది చారిత్రక వాస్తవం.

దయానందుడికి యీ విషయాలన్నీ తెలియకపోలేదు. అయినా హిందూ సమాజాన్ని పునీతం చేసి, కాపాడాలని కంకణం కట్టుకున్నారు. ఆయన ప్రభావం దృష్ట్యా ముందుగా జీవిత విశేషాలు తెలుసుకుందాం.

సన్యాసులందరివలె దయానందుడి అసలు పేరు మూలశంకరుడు. ఇతడి తండ్రి తివారి. తల్లి అమృతాబెన్. వారు శివభక్తులు. గుజరాత్ రాష్ట్రంలో కర్షన్ జిల్లాకు చెందినవారు. కుటుంబమంతా మత సంస్కృతి సంప్రదాయాలతో, భక్తిప్రపత్తులతో నిండివుండేది. 1824లో మూలశంకరుడు పుట్టాడు. సంస్కృతం చదివాడు. ఇంగ్లీషు జోలికి పోలేదు. మూలశంకరుడికి ఆప్తులు సన్నిహితులు, చదువు గలవారు అతడి సోదరి, అతడి మామ. వారిరువురూ చనిపోవడంతో అతడు మానసికంగా వికలత చెందాడు. ఇంట్లో సంప్రదాయాల బరువు, బాధ్యతలు సనాతన