పుట:Abaddhala veta revised.pdf/156

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆకర్షితులైన కేశవచంద్ర,హిందువులకు దూరమయ్యాడు. దేశ, విదేశాలలో బ్రహ్మ సమాజాన్ని ప్రచారం చేసిన కేశవచంద్ర అందులో చీలికలకు కూడా దారితీశాడు. 1865లో జంధ్యం ఉండాలా? అక్కరలేదా? అనే విషయమై తీవ్ర చర్చలు జరిగిన అనంతరం, కేశవచంద్ర బ్రహ్మసమాజ్ లో చీలిపోయి భారత బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. 1878లో అందులోనూ చీలిక ఏర్పడింది. కేశవచంద్ర కుమార్తె మైనర్ గా వుండగా, కూబ్ బీహార్ యువరాజుకు యిచ్చి వివాహం చేసినప్పుడు తీవ్ర విమర్శలకు గురైనాడు. అప్పుడే చీలినవారు సాధారణ బ్రహ్మసమాజ్ ఏర్పరచారు.

పాశ్చాత్య ప్రపంచం నుండి మనం సైన్సు నేర్చుకోవచ్చనీ,వారికి మన ఆధ్యాత్మికత నేర్పవచ్చనీ కేశవచంద్ర ప్రచారం చేశాడు.

బ్రహ్మసమాజ్ శాఖలు దేశవ్యాప్తంగా ఏర్పడినా, వాటి ప్రచారం పరిమితంగానే నిలచింది. విగ్రహారాధన కంటే, ఏకేశ్వరారాధన కొంత మెరుగు అనుకున్నా,అది మతపరంగా ఛాందసుల వాదనల్ని అడ్డుకోలేకపోయింది. సామాజిక రంగంలో కొంత పురోభివృద్ధి సాధించినా మతపరంగా బ్రహ్మసమాజ్ ఆట్టే ముందుకు పోలేకపోయింది.

దేశంలో ప్రప్రధమంగా ఆధునిక యుగంలో సంస్కరణోద్యమం తలపెట్టిన బ్రహ్మసమాజం విఫలమైంది. మతాన్ని మూలంలో కొట్టాలే గాని, కొమ్మలు నరికితే మళ్ళీ చిలవలు వలవలుగా చిగుర్లు వేసి వ్యాపిస్తుందని రుజువైంది.

'- హేతువాది, ఫిబ్రవరి 1989
పునర్వికాస పరిణామం
పదండి వెనక్కు-వేదాల్లో విమానాలున్నాయిట!

వేదాల్లోనే అన్నీ వున్నాయి. వేదేతరమైనవన్నీ తృణీకరించాలి. ప్రతి ప్రమాణం వేదాలకు మాత్రమే వున్నది. కనుక వేదకాలంలోకి పోదాం. అంటూ 19వ శతాబ్దంలో దయానంద బయలుదేరాడు. ఆర్యసమాజ్ ను స్థాపించాడు. క్రైస్తవులుగా,ముస్లింలుగా మారిన హిందువులను శుద్ధిచేసి మళ్ళీ హిందువులుగా మార్చే ప్రయత్నం చేశాడు. ఇంగ్లీషు చదువుల్ని,పాశ్చాత్య ఆలోచనా ధోరణులను కాదన్నాడు - ఉత్తరభారతంలో దయానంద్ బాగా పర్యటించాడు. విపరీతంగా ప్రచారం సాగించాడు. వేదప్రమాణాన్ని నిలబెట్టడానికి సనాతన పండితులను ఎదుర్కొన్నాడు. ఆర్యసమాజ్ ప్రభావం జాతీయభావాలు గలవారిపై ఎంతో పనిచేసింది. జనాన్ని వెనక్కు నడిపించింది.

భారతీయ తత్వశాస్త్రం, మతజ్ఞానం పరికిస్తే వేదప్రమాణాలను కాదన్న హిందువులు అరుదు. బ్రహ్మసమాజ్ లో కొందరు వేదం అపౌరుషేయం అనడాన్ని ప్రశ్నించారు. మిగిలిన