పుట:Abaddhala veta revised.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సనాతనులకు గోపీమోహన్ దేవ్, రాధాకాంతదేవ్ అజమాయిషీ చేశారు. రామమోహన్ హిందువులను ఆకట్టుక రావడంలో చివరివరకూ జాగ్రత్త వహించాడు. ఏటా బ్రాహ్మణులకు దానాలు చేసేవాడు. యజ్ఞోపవీతం విడనాడకుండా కాపాడాడు. ఇంగ్లండ్ లో యూరోప్ వారితో పంక్తి భోజనానికి కూర్చున్నా, రామమోహన్ శాకాహారానికే పరిమితమయ్యాడు. చనిపోయిన తరువాత తనను క్రైస్తవుల స్మశానంలో పెట్టవద్దన్నాడు. అలాగయితే తన ఆస్తి కుమారులకు సంక్రమించడంలో పేచీలు వస్తాయన్నాడు.

తన సమావేశాలకు అన్ని కులాలవారిని రామమోహన్ ఆహ్వానించేవాడు. కాని అధికసంఖ్యాకులు కులీన బ్రాహ్మణులే వుండేవారు.

మొత్తం మీద 1815 నుండీ కలకత్తాలో ఆత్మీయసభ ద్వారా రామమోహన్ సంస్కరణ కృషి చేశాడు. ఆధునిక విద్యకు ప్రోదిచేశాడు. పత్రికల స్వేచ్ఛ కోరాడు. సతీసహగమనాన్ని నిషేధించాలన్నాడు. సంస్కరణవాదంపై సనాతనుల దాడిని ఎదుర్కొన్నాడు. మరోవైపు జమీందార్ల ఆసక్తులను కాపాడడంలో యధాశక్తి కృషి కొనసాగించాడు.

బ్రహ్మ సమాజం

1928లో కలకత్తా రామమోహన్ బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. విశ్వవ్యాప్తంగా మతవాద ప్రచారం చేయాలని, ఒకే మతం, ఒకే దైవం వుండాలని వీరి ఉద్దేశం. ప్రపంచ ప్రభుత్వం కూడా ఏర్పడాలన్నారు. ఏకేశ్వరారాధన అనేది వేదసంహితలలో వున్నదని రామమోహన్ ఉద్దేశం. బ్రహ్మసమాజ ప్రభావం తక్షణమే అంతగా వున్నట్లు ఆధారాలు లేవు. పైగా యీ సమాజాన్ని స్థాపించిన రెండేళ్ళకే రామమోహన్ ఇంగ్లండ్ వెళ్ళిపోయాడు.

'రాజా' రామమోహన్ రాయ్ కు, బ్రహ్మసమాజ్ కు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది సతీ సహగమన వ్యతిరేకత. సతీసహగమనం నాడు బెంగాల్, బీహారు ప్రాంతాలలో ఉన్నత తరగతులకు పరిమితమై వున్న దురాచారం. సతీసహగమనం నిషేధించరాదని ధర్మసభ సనాతనులు సంతకాలు సేకరించి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన రోజులవి! రామమోహన్ కుటుంబంలో సతీసహగమనం పాటించిన ఆధారాలేవీ లేవు, ఆయన వదిన అలకమంజరి భర్త చితిపై చనిపోయిందనప్పుడు, ఆధారాలు లేని కట్టుకధగానే యిది వ్యాపించింది. 1912లో జరిగినట్లు చెబుతున్న యీ కథనం సందర్భంగా రామమోహన్ అక్కడలేరు. వాస్తవాలు పరిశీలిస్తే 1818లో రామమోహన్ సతీసహగమన వ్యతిరేకత ప్రారంభించారు. అప్పటికే క్రైస్తవ మిషనరీలు, బ్రిటిష్ ప్రభుత్వం 'సతి' ఆచారాన్ని నిషేధించాలన్నాయి. ఇందుకు దేశీయుల మద్దత్తు కావాలని వారు ఆశించారు. ఒకేసారి 'సతి' నిషేధం జరిగితే, ప్రజలు తిరగబడతారని రామమోహన్ అభిప్రాయం వెల్లడించారు. క్రమేణా నిషేధం జరగాల్సిందేనన్నాడు. ఇంగ్లండ్ వెళ్ళినప్పుడు ప్రీవీ కౌన్సిల్ లో సతి నిషేధం పై చర్చలు సాగుతుండగా, రామమోహన్ హాజరుకాలేదు. జమీందార్ల భరణం పెంచాలనే విషయం ఎక్కువగా పట్టించుకున్నాడు. అయితే సతి నిషేధం 1929లో