పుట:Abaddhala veta revised.pdf/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విగ్రహారాధనను వ్యతిరేకించిన బ్రహ్మసమాజవాదులు ముఖ్యంగా, ప్రసన్నకుమార్ టాగోర్ దుర్గపూజలో పాల్గొన్నందుకు డిరోజియో ఖండించారు. డిరోజియో అనుకూలురు, శిష్యులు కూడా వివిధ పత్రికలు పెట్టి, సంఘాలు స్థాపించి భావ ప్రచారానికి పూనుకున్నారు. 1831 డిసెంబరులో డిరోజియోకు కలరా వ్యాధి సోకింది. ఆ విషయం తెలిసి కూడా అతని మిత్రులు పడకచుట్టూ చేరి ఆతృతగా డిరోజియో చావుబ్రతుకులమధ్య కొట్లాడుతుండగా చెంత ఉన్నారు. డిసెంబరు 17న డిరోజియో చనిపోయాడు.

చిన్న వయసులోనే జీవితాన్ని చాలించిన డిరోజియో చాలామంది యువకులను ప్రభావితం చేసి యువకులను ఉత్తేజపరచి పునర్వికాస ఉద్యమానికి నాంది పలికారు. డిరోజియోకు, రాంమోహన్ రాయ్ కూ స్నేహం ఉన్నదీ లేనిదీ స్పష్టపడలేదు. డిరోజియో స్థాపించిన అకడెమిక్ అసోసియేషన్ ప్రభావంతో ఆయన అనంతరం యువబెంగాల్ సంఘాన్ని స్థాపించారు. ఇది ఒక ఉద్యమంగా పెంపొందలేకపోయింది గాని ఇంచుమించు 10 సం॥ల పాటు డిరోజియో ప్రభావంతో కొందరు కృషిచేసినట్లు స్పష్టపడింది. టాం పెయిన్ "ఏజ్ ఆఫ్ రీసన్" చదవటం, బెంథాం సూత్రాలను అనుసరించటం,ఏడం స్మిత్ ఆర్థిక సూత్రాలను అధ్యయనం చేయటం వీరి ప్రధాన లక్షణాలుగా కనిపించాయి. డిరోజియో అనుచరులలో రసిక్ కృష్ణమల్లిక్, తారాచంద్ర చక్రవర్తి, రాంగోపాల్ ఘోష్,దక్షిణరంజన్ ముఖోపాధ్యాయ, కృష్ణమోహన్ బంధోపాధ్యాయ,రాధానాధ్ సిక్దర్ పేర్కొనదగినవారు. డిరోజియో స్థాపించిన అకడమిక్ అసోసియెషన్ కు డా॥హేర్ అధ్యక్షులుగా కొనసాగుతూ డిరోజియో ధోరణి ప్రచారంచేశారు. డేవిడ్ హేర్ హిందూ కాలేజి స్థాపకులుగా స్కూల్ సొసైటీనీ,స్కూల్ బుక్ సొసైటీనీ స్థాపించి మెడికల్ కళాశాలను 1835లో ప్రారంభించారు. డిరోజియోకు శిష్యులు బొంబాయి, గుజరాత్ లలో కూడా ఉండేవారు. 1838 ఫిబ్రవరి 28న విజ్ఞానార్జనకు సమాజాన్ని ఏర్పరచి తారాచంద్ చక్రవర్తి అధ్యక్షతన మూడు సంపుటాలు ప్రచురించారు. డిరోజియో సంఘాలన్నీ సాంస్కృతిక సమితులుగా ప్రారంభమై రాజకీయాలలోకి దారితీశాయి. సత్యాన్వేషణ జరపాలనే డిరోజియో ధోరణి వీరంతా కొంతకాలం కొనసాగించి పునర్వికాస ఉద్యమానికి హేతువాద ధోరణికి నాంది పలికారు. కాని,అది అట్టేకాలం నిలవలేకపోయింది. మత సంస్కరణ వాదం ఒకవైపున, సనాతనవాదం మరొకవైపున సమాజాన్ని ఆకట్టుకున్నాయి.

- హేతువాది, డిసెంబరు 1988
పునర్వికాస పరిణామం
సగం సంస్కరణ - సగం పునర్వికాసం

దేశంలో పునర్వికాసానికి డిరోజియో నాంది పలికితే,హిందూ పునర్వికాసానికి రాజా రామమోహన్ రాయ్ శ్రీకారం చుట్టాడు. వాస్తవంగా అంచనా వేస్తే రామమోహన్ రాయ్