పుట:Abaddhala veta revised.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారాంతంలో చర్చలు జరిపేవారు. అప్పట్లో కళాశాల విద్యార్థుల సంఖ్య కేవలం వందల్లోనే ఉన్నది. 1830 ఫిబ్రవరిలో ఎధీనీయం అనే పత్రికను కూడా హిందూ కలాశాల విద్యార్థులు ప్రారంభించి 2 సంచికలు వెలువరించారు. ఇందులో స్త్రీవిద్య, న్యాయాన్ని అందించటంలో అధికవ్యయం లేకుండా చూడటం, మూఢనమ్మకాలపై విమర్శ సాగించారు. ఐతే, డా॥హెచ్. హెచ్.విల్సన్ కలాశాల అధిపతిగా ఆ పత్రికను మూతవేయించారు. డిరోజియో తన ఉపన్యాస పరంపరలో బేకన్, బెంధాం, హ్యూం,లాక్, పెయిన్, స్మిథ్ ల తత్వాలను, ఆలోచనలను విద్యార్థులకందించారు. వలసవాదానికి వ్యతిరేకంగా విద్యార్థుల వాదన ప్రారంభమైంది. ఫ్రెంచి విప్లవాన్ని ఆవేశపూరితంగా సమర్ధించారు.

సనాతన హిందువులు డిరోజియో నాయకత్వాన జరుగుతున్న ధోరణులను గమనించి ఆందోళన చెందారు. బృందావన్ గోపాల్ అనే విద్యార్థి సనాతనులకు డిరోజియో సమాజంలో జరుగుతున్న విషయాలను చిలవలు పలవలుగా చెప్పి వారిని కలవరపరిచాడు. 1831 ఏప్రిల్లో కళాశాలలో జరుగుతున్న విషయాలను వ్యతిరేకిస్తూ సనాతనులు ఒక కరపత్రాన్ని ప్రచురించారు. అప్పటికే డిరోజియోకు హెడ్ మాస్టర్ యాక్స్ లమ్ కు సిద్ధాంతపరమైన వివాదం చెలరేగింది. 1831 ఫిబ్రవరి 5న కళాశాల సంఘం ఈ వివాదాన్ని సర్దుబాటు చేసింది. ఐతే, సనాతాన హిందువుల ఆందోళన కారణంగా డిరోజియోపై ఒక ప్రత్యేక విచారణ సంఘాన్ని ఏర్పరిచారు. కళాశాలలో అలజడికి దారితీసిన డిరోజియోను తొలగించాలనేది అభియోగం. 1831 ఏప్రిల్ 23న హిందూ కళాశాల డైరెక్టర్లు ప్రత్యేక సమావేశం జరిపి విషయాన్ని పరిశీలించారు. యువకులకను డిరోజియో చెడగొడుతున్నాడని ముగ్గురు సభ్యులు అభిప్రాయపడగా ఆరుగురు అందుకు సమ్మతించలేదు. విద్యార్థులపై కూడా చర్య తీసుకోవాలని, హిందూయిజంపై దాడిచేసే విద్యార్థులను కాలేజి నుండి తొలగించాలని ప్రతిపాదించారు. డిరోజియో దోషి అని కమిటీ తేల్చలేకపోయినా హిందువులలో ఉన్న వ్యతిరేక భావాన్ని దృష్టిలో పెట్టుకొని డిరోజియోను తొలగించాలని తీర్మానించారు. తొలగించనక్కరలేదని శ్రీకృష్ణసిన్హా వాదించారు. తొలగించటం ఆపద్ధర్మచర్యగా ప్రసన్న కుమార్ టాగోర్, రసమయిదత్త అభిప్రాయపడ్డారు. తొలగించడం అవసరమని చంద్రకుమార్ టాగోర్, రాధాకాంత్ దేవ్, రాం కమల్ సేన్, రాధామాధవ బంధోపాధ్యాయ తలపెట్టారు. 1831 ఏప్రిల్ 25న విల్సన్ సలహాపై డిరోజియో తన రాజీనామా లేఖను పంపారు. వదంతులుగా విల్సన్ పేర్కొన్న అభియోగాలను డిరోజియో ఎదుర్కొన్నారు. ఆయన ఒక లేఖ పంపిస్తూ నాస్తికవాదాన్ని చర్చించటం తప్పా అని అడిగారు. హ్యూం వాదనలను అందుకు వ్యతిరేకమైన అభిప్రాయాలను విద్యార్థులకు వినిపించామనీ,అందుకుగాను తనను సందేహవాదిగా, మ్లేచ్ఛుడుగా మతపరమైన వ్యక్తులకు అలవాటేనన్నారు. డిరోజియోను తొలగించిన తరువాత కొందరు విద్యార్థులు కూడా కాలేజినుండి వెళ్ళిపోయారు. డిరోజియో "ఈస్ట్ ఇండియన్" అనే దినపత్రికను స్థాపించి తన అభిప్రాయాలనూ, ఆదర్శాలనూ కొనసాగించారు. ఆంగ్లో ఇండియన్లు, భారతీయులూ సఖ్యంగా ఉండాలన్నారు. ఏకేశ్వరారాధనను ప్రచారం చేసి