పుట:Abaddhala veta revised.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రారంభించారు. రామమోహన్ రాయ్ కలకత్తా వచ్చి ఆత్మీయ సభ స్థాపించి చర్చలు కొనసాగించిన రోజులవి. బెంగాల్ సంపన్న కుటుంబీకులు కలకత్తాలో 1817లో కొందరు యూరోపియన్లతో కలసి హిందూ కళాశాల స్థాపించారు. భారత పునర్వికాసానికి ఈ కళాశాల ఎంతో తోడ్పడింది. బహుశ ఈ కృషికి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా హెన్రీ లూయీ ఎవిలిన్ డిరోజియోను పేర్కొనవచ్చు.

డిరోజియో 1809 ఏప్రిల్ 19న కలకత్తాలో పుట్టాడు. తండ్రి ఫ్రాన్సిస్ డిరోజియో. ఇతడు చీఫ్ అకౌంటెంట్ గా జేమ్స్ స్కాట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. తల్లి సోఫియా జాన్సన్. 1806లో వీరి వివాహం జరిగింది. డిరోజియో పుట్టిన 6 సం॥లకే 1815లో తల్లి చనిపోయింది. తండ్రి మరొక వివాహం చేసుకున్నాడు. సవతితల్లి అన్నా మేరియా రివర్స్ డిరోజియోను బాగా చూచుకున్నది. 1851లో ఆమె చనిపోయింది. 1809 ఆగస్టు 12న కలకత్తా సెంట్ జాన్స్ చర్చిలో హెన్రీ డిరోజియో బాప్టిజం జరిగింది. డిరొజియో డ్రమండ్ అకాడమీలో చేరి పాఠశాల విద్యనభ్యసించాడు. డేవిడ్ డ్రమండ్ (1757-1843) కవి, తత్వచింతన కలవాడు. 1813లో ఇండియాకు వచ్చి అకాడమీని స్థాపించి చాలామందికి విద్యారంగంలో బీజాంకురాలు ఏర్పడటానికి తోడ్పడ్డాడు. ఈ స్కూలులో కవిత్వం, నాటకరంగాల గురించి ప్రత్యేక కృషి జరిగింది. పాఠశాలలో ఉండగానే డిరోజియో ఇంగ్లీషులో కవితలల్లాడు. ప్రతిభాశాలి అనిపించుకున్నాడు. ఐతే విద్యాభ్యాసం పూర్తికాకుండానే 14వ ఏట పాఠశాల వదలి తండ్రి పనిచేస్తున్న మర్కంటైల్ సంస్థలో రెండేళ్ళు ఉద్యోగం చేసి తరువాత భాగల్ పూర్ లోని తారాపూర్ నీలిమందు కంపెనీలో చేరాడు. ఉద్యోగం చేస్తున్నా నిర్విరామంగా కవితలు వ్రాస్తూనే ఉండేవాడు. ది ఇండియా గజెట్ లో సబ్ ఎడిటర్ గా ఉద్యోగంలో చేరే నిమిత్తం 1826లో కలకత్తా చేరుకున్నాడు. డా॥ జాన్ గ్రాంట్ కారణంగా ఈ ఉద్యోగం లభించింది. 1826 నవంబరులో నెలకు 150రూ. జీతంతో కలకత్తాలోని హిందూ కళాశాలలో టీచరుగా చేరాడు. అప్పటికే తన మొదటి కవితా సంపుటిని డా॥గ్రాంట్ కు అంకితం ఇచ్చాడు. కవిగా, రచయితగా రుపొందుతున్న డిరోజియో ఇంగ్లీషు పాఠకలోకంలో గుర్తింపు పొందనారంభించాడు. కలకత్తా మాగజైన్, బెంగాల్ మాన్యువల్ కేలడోస్కోప్, హేస్పెరస్, కలకటా లిటరరీ గజట్ వంటి పత్రికలలో తన కవితలూ, రచనలూ ప్రకటించాడు. సతీ సహగమన నిషేధాన్ని ఆహ్వానించాడు! ద్రీస్ విమోచనను శ్లాఘించాడు.

హిందూ కళాశాలలో డిరోజియో కొత్త పద్ధతిలో చరిత్ర బోధించాడు. ప్రశ్నించి తెలుసుకోవడం, వైజ్ఞానికంగా పరిశీలించడం అతడి ఆయుధాలుగా ఉండేవి. కాంట్ తత్వం పై తీవ్రవిమర్శచేస్తూ రచన సాగించాడు. పాశ్చాత్య ఆలోచనా ధోరణిలో విద్యార్థులు పయనించటానికి వీలుగా కృషి చేశాడు. ఇది హిందూ కళాశాల విద్యార్థులను ఆకట్టుకున్నది. కళాశాలలో ప్రథమ చర్చావేదికను ప్రారంభించారు. సంప్రదాయాలనూ,ఆచారాలనూ పట్టించుకోకుండా తిరుగుబాటు ధోరణి వ్యక్తపరిచారు. డిరోజియో ఇంట్లోకూడా చర్చలు కొనసాగాయి. హిందూమతంలోని జుగుప్సాకరమైన అనేక ఆచారాలను వీరు నిరసించారు. సత్యాన్వేషణ ఒక్కటే వారికి లక్ష్యంగా కనిపించింది. 1828లో అకడమిక్ అసోసియేషన్ ప్రారంభించి యథేచ్ఛగా చర్చలు చేశాడు.