పుట:Abaddhala veta revised.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మెస్కలిన్ అనేది శరీరానికి హానిచేయదు గనుక, పరిశోధనకు స్వీకరించారు. అదే మేరియానా (Marijuana),ఎల్.ఎస్.డి., గంజాయి అయితే అవి అలవాటుగా మారే ప్రమాదం వుంది. కొన్నాళ్లు తీసుకొని మానేస్తే దేహంలో ఉపసంహరణానంతర లక్షణాలు వచ్చి బాధపెడతాయి. దీనికి వేరే చికిత్స అవసరమౌతున్నది. సాధారణ మానవులు పండగల సందర్భంగా ఉత్తరాదిలో భంగు తాగుతారు. గంజాయిఆకు పాలల్లో వెసి, మసాలా సుగంధ ద్రవ్యాలతో పాయసంవలె చేసి సేవిస్తారు. కాని సాధువులు గంజాయిని హుక్కాగా పీల్చుతారు. దీనికి అలవాటు పడతారు. తాంత్రికవిద్యను పాటించేవారు 'విజయ' పేరిట మత్తుపానీయం సేవిస్తారు. బెంగాల్ ప్రాంతంలో దీనినే 'సిద్ధి' అంటారు.

మతం పేరిట ఆధ్యాత్మిక చింతనలో సమాధి, కైవల్యం, ముక్తి, నిర్వాణం యిత్యాదులన్నీ పొందడానికి అనేక మార్గాలు చెప్పారు. అవన్నీ కృత్రిమాలే, సాధారణ జీవనం సాగించేవారికి కుదిరేవికావు. అలాగే మెస్కలిన్ పరిశోధన కూడా.

ఆరోగ్యవంతులు మెస్కలిన్ వేసుకొని పరిశోధన చేస్తే మధురానుభూతులు వస్తాయన్నాం. అనారోగ్యంగా వున్నవారు స్వీకరిస్తే నరకం, యమయాతన, సైతాన్ బాధలు, మురికికూపాలు మొదలైనవి అనుభవిస్తారు. లివర్ లో మెస్కలిన్ చేరి ఇలాంటి చేదు అనుభవాలకు దారితీస్తుంది. సాధువులు, యోగులు అనారోగ్యంగా వున్నప్పుడు అనుభూతుల్ని పొంది, నరకం ఏమిటో వివరించారు.

హక్స్ లీ చేసిన మెస్కలిన్ పరిశోధనపై మతవాదులు విరుచుకుపడ్డారు. జహ్నర్ (R.C. Zaehner) వంటివారు పెద్ద పుస్తకాలే రాశారు. కాని సమాధానం చెప్పలేకపోయారు. హక్స్ లీ అనుభూతి బౌద్ధులు చెప్పే శూన్యదశ వంటిదని అగేహానంద భారతి పేర్కొన్నారు. యోగం చెప్పేది కూడా యిలాంటి చిత్తవృత్తి నిరోధ శూన్యావస్తే. "నేనే బ్రహ్మను" అని సాధువు అంటే, మహానుభావుడు అంటాం, మామూలు వ్యక్తి మెస్కలిన్ తీసుకొని అలాగంటే, పిచ్చివాడంటాం. ఆల్డస్ హక్స్ లీ చేసిన ప్రయోగాలవంటివి, ఉత్తరోత్తరా ఆగేహానంద భారతి చేశారు. ఇంకా కొందరు చెసినా, ఆగేహానంద స్వానుభవం గుర్తించి గమనించదగింది.

అగేహానంద భారతి ప్రయోగాలు

1958లోనే ఆగేహానంద భారతి అమెరికాలో కొత్తగా వచ్చిన ఎల్.ఎస్.డి-25(లాసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్) పుచ్చుకున్నారు. రాత్రి 8 గంటలకు స్వీకరిస్తే తెల్లవారుజామున 4 గంటలవరకూ ప్రభావం వున్నది. ఎల్.ఎస్.డి తీసుకునేవాళ్ళు ఆనందమయ వాతావరణంలో అంగీకార మిత్రుల సాన్నిహిత్యంలో గడపాలని భారతి సూచించారు. భంగు(గంజాయి రసం) కూడా యిలాగే తీసుకోవాలంటారు. అగేహానంద ఎల్.ఎస్.డి. పుచ్చుకున్నప్పుడు మాత్సుకో అనే అందమైన బౌద్ధస్త్రీ చెంతవున్నది. బ్రహ్మానంద సమయంగానూ, శూన్యావస్తను పొందిన క్షణాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. (ది లైట్ ఎట్ ది సెంటర్, పేజి 43) అహం బ్రహ్మాస్మి అనే స్థితికి