పుట:Abaddhala veta revised.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గంటన్నర తరువాత వింత దృశ్యాలు కనిపించసాగాయి. అందరూ మామూలుగా చూచే బాహ్య ప్రపంచం "మరో విధంగా" కనిపించసాగింది. అప్పుడు హక్స్ లీ పక్కనే వున్న పరిశీలకుడు అతడి మాటలన్నీ రికార్డు చేశాడు. మధ్యమధ్యలో హక్స్ లీని ప్రశ్నిస్తూ పోయాడు. కాలం, ప్రదేశాలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని హక్స్ లీ ప్రవర్తన సూచిస్తుంది. సూటిగా ఆలోచించడం,జ్ఞాపకం పెట్టుకోవడం అంతగా వుండదు. చిన్నపిల్లవాడివలె బాహ్య ప్రపంచాన్ని చూస్తాడు. తన చర్యలకు కారణమేమిటో గ్రహించలేడు. ఇచ్ఛ దెబ్బతింటుంది. మంచి చెడ్డల విచక్షణ పాటించడు. కాలేయం (లివర్) ఆరోగ్యంగా పనిచేస్తున్నవారు మెస్కలిన్ పుచ్చుకుంటే, బాహ్య ప్రపంచం, అంతర లోకం కలిసిపోయి కనిపిస్తాయి.

మెదడుకు తగినంత గ్లూకోజ్ అందనప్పుడు, బలహీనతలు బయటపదతాయి. మెస్కలిన్ పరిశోధన అదే నిరూపిస్తుంది. అతీంద్రియ శక్తులు, దూరదృష్టి, దూరశ్రవణం,దివ్యదృష్టి, దూరశ్రవణం, దివ్యదృష్టి అని పేర్లు పెట్టేవన్నీ ఇలాంటివే. అయోమయంగా ప్రపంచాన్ని తననూ చూచుకుంటే, వారిని మార్మికులంటాం (మిస్టిక్స్). అందమైన దృశ్యాలు చూచి కవిత్వం అల్లేవారూ, చిత్రాలు గీచేవారూ, శిల్పాలు చెక్కేవారూ వున్నారు. దేవుళ్ళ బొమ్మలు, శిల్పాలు చాలావరకూ ఆయా వ్యక్తుల మనోగతాలే. భారతమాత, ఆంధ్రమాత పేరిట చెక్కిన విగ్రహాలు,గీసిన బొమ్మలు యీ కోవకు చెందినవే.

మెస్కలిన్ ప్రభావంలో రంగుల్ని లోతుపాతులతో సున్నితంగా గ్రహించే లక్షణం కూడా వుంది. ఇది మార్మికులలో బాగా కనిపిస్తుంది. ఆల్దస్ హాక్స్ లీ కూడా ఇలాంటి అనుభూతుల్ని పొంది, రికార్డు చేశాడు. యోగం పేరిట ధ్యానం అనే అనుభవం వంటిదే మెస్కలిస్ పేరిట హక్స్ లీ పొందాడు. అందుకే పతంజలి యోగంలో చిత్తవృత్తి నిరోధం ప్రధానం. అంటే మెదడు మామూలుగా ఆలోచించే ధోరణి ఆపేయాలి. మోక్షానికి అది దగ్గర మార్గం అన్నారు. బడుల్లో కూడా పిల్లలకు కాసేపు ధ్యానం నేర్పాలంటారే, అదంతా తెలిసీ తెలియక అనేమాటలే. సాధారణ వ్యక్తులెవరూ ఆలోచన ఆపలేరు. మెదడు మామూలుగా పనిచేయకపోతేనే యిది సాధ్యం. మధుమేహం (డయాబిటిస్) వున్నవారికి అప్పుడప్పుడు అశ్రద్ధవలన మత్తురావడం, స్పృహ తప్పడం కద్దు. ఉబ్బసం (ఆస్త్మా) వున్నవారికి తరచు ఎడ్రినలిన్ వలన రకరకాల వింత దృశ్యాలు కనిపించడం కద్దు. రామకృష్ణ పరమహంసకు మూర్ఛ వ్యాధి వుండేది. ఫిట్స్ వచ్చి పడిపోయేవాడు. తనను ఉన్మాదిగా చేయమని అరచేవాడు. ఇదంతా మహాత్ముని లక్షణంగా భక్తులు భావించారు. కాని అంతటి మహాత్ముడికి కేన్సర్ వస్తే దివ్య లక్షణాలు ఆదుకోలేదు. జబ్బుల్ని దైవలక్షణాలుగా చూచే గుణం వీరారాధనలో భాగమే. ఇది అన్ని మతాలలోనూ వుంది. ఏ మహర్షికి కేన్సర్ వచ్చినా ఇదే స్థితి! విదేశీయులు కొందరు పొగుడుతూ పుస్తకాలు రాస్తే మనవాళ్ళు అవి వుదహరించి, గొప్పతనానికి సర్టిఫికెట్లుగా భావిస్తున్నారు. తెల్లవాళ్ళంటే మనకున్న ఆరాధన, మనల్ని తక్కువగా చూచుకునే లక్షణమే యిదంతా.