పుట:Abaddhala veta revised.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెవిలో మంత్రం చెప్పి,అదేపనిగా పునరుశ్చరణ చెయమనడంలో కూడా యీ సూత్రమే అమలు జరుగుతుంది. ఒంటరిగా కూర్చొని మంత్రాన్ని కొన్నివందల వేలసార్లు వుచ్ఛరించేవారికి ఆలోచన మరేదీ వుండదు. మెదడు మామూలుగా పనిచేయదు. "హరి ఓం" అని గాని, మరోవిధంగా గాని, చెప్పినమాటే నిరంతరంగా చెబుతున్నవారు గాలి తక్కువ పీల్చి, ఎక్కువ వదులుతారు. భక్తిగీతాలు పాడేవారూ అంతే.

పూర్వం తపస్సు పేరిట దేహాన్ని శుష్కింపజేసిన వారిలో బి విటమిన్,సి విటమిన్ బాగా తక్కువగా వుండేది. పోషకాహారం లోపం వలన కూడా మెదడు సరిగా పనిచేయదు. వారు కూడా దృశ్యాలను చూడడం, అవి దివ్యదృశ్యాలని మధురానుభూతులని, భ్రమించడం కద్దు. దేవుడు ప్రత్యక్షమైనట్లు, వరాలిచ్చినట్లు వీరు అనుభూతి పొందుతారు. మామూలు స్థితికి వచ్చిన తరువాత చుట్టుపట్ల వున్నవారికి వారి అనుభూతులు, దృశ్యాలు వర్ణిస్తే, జనం అది విని వారిని "ద్రష్టలు" గా దైవాంశసంభూతులుగా, దైవజ్ఞులుగా, రాజర్షులు, మహర్షులు యిత్యాది పేర్లతో పిలిచి, కొలిచేవారు.

సాధారణ జనం ఎక్కువరోజులు తినకుండా తాగకుండా వుండలేరు. వారు కష్టించి పనిచేస్తేగాని గడవదు. అలాంటివారిని వారానికో పర్యాయం ఉపవాసం వుండమని నియమం పెట్టారు. మతపరంగా సంవత్సరంలో కొన్నాళ్ళు వరుసగా ఉపవాసాలు చేయిస్తున్న సంగతి అన్ని మతాలవారికీ తెలిసిందే. పరిమిత దృశ్యాలు, అనుభూతులకు వారు లోనుకావచ్చు. ఇలాంటివారిలో ఆధ్యాత్మిక రచయితలుంటే, వారు చూచిన, విన్న అనుభూతుల్ని గేయాలు, కథలు, రచనలుగా మార్చి అందిస్తారు.

శరీరాన్ని కష్టపెట్టడం తప్పుకాదని, పాపిష్టి శరీరం, ఎంత బాధలకు లోనైనా, ఆత్మకు ముక్తివస్తే చాలునని అన్ని మతాలు చెప్పాయి. మొహరంలో ముస్లింలు, కొలువుల్లో హిందువులు శరీరాన్ని బాదుకుంటారు. అలాంటప్పుడు ఎడ్రినలిన్, హొస్టామైన్ అనేవి విడుదల అవుతాయి. పుండ్లు పడడం, గాయాలు ఏర్పడడం సహజంగా జరుగుతుంటుంది. ప్రోటీన్లు దెబ్బతిని, టాక్సిక్ పదార్థాలు రక్తంలోకి పోతాయి. హిస్టామైన్ విడుదల అయి మెదడుకు షాక్ తగులుతుంది. ఆడ్రినలిన్ ఎక్కువగా విడుదల అయితే మెదడుపై ప్రభావం చూపెట్టి, భ్రమలు కలుగుతాయి. మెదడు సక్రమంగా పనిచేయడానికి ఎంజైములు కావాలి. శరీరాన్ని బాదుకున్నందువలన ఏర్పడే గాయాల నుండి స్రవించే టాక్సిక్ పదార్థాలు మెదడును సరిగా పనిచేయనియ్యవు. అప్పుడు కలిగే అనుభూతుల్ని మార్మికులు గొప్పగా చిత్రించి దివ్యమైనవిగా ప్రచారం చేశారు. మరికొందరు నిద్రను తగ్గించుకొని యోగాసనాల పేరిట శరీరాన్ని బాధపెట్టుకుంటారు. వీరికి క్రమేణా నిద్రపట్టని జబ్బువస్తుంది. ఆ దశలో ప్రార్థనలు చేస్తుంటారు. వీరికి మధురానుభూతులు వస్తాయి. 'సమాధి' దశవరకూ పోతుంటారు కూడా.