పుట:Abaddhala veta revised.pdf/133

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రీయంగా తెలుసుకుంటున్నారనేది చదువుకున్నవారు అట్టే పట్టించుకోరు. కనుక చిన్నప్పటినుండీ తల్లిదండ్రులు, బడిలో ఎన్ని నేర్చుకున్నా నమ్మకాల నుండి చదువుకున్నవారు సైతం ఒక పట్టాన బయటపడలేరు. పదవుల్లో వున్నవారికి భయాలు ఎక్కువ. కనుక ఎందుకైనా మంచిదని మొక్కుబడులు చేస్తూ, అవి చెల్లిస్తూ వుంటారు. వీటిల్లో స్నేహితుల చెప్పుడుమాటలు బాగా పనిచేస్తాయి. ఆపదలో వున్నప్పుడు జబ్బు చేసినప్పుడు యివి మరీ నమ్మకాల్ని పెంచుతాయి. అంజనం, తాయెత్తు, పూజలు, వ్రతాలు, నోములు, మొక్కుబడులు,స్వాముల దర్శనం, జోస్యం మొదలైనవన్నీ యిలా వ్యాపిస్తూ వస్తున్నాయి.

అందరూ చూడలేని 'దివ్యదృష్టి' సాధువులకు ఎలా కలుగుతుంది? చిరకాలంగా ప్రచారంలో వున్న యీ విషయాన్ని అవగహన చేసుకోవాలి.

మనిషి ప్రాణవాయువు పీల్చడం అతిముఖ్యాంశం. అది లేకుంటే బ్రతకడం, పీల్చిన ప్రాణవాయువు వూపిరితిత్తులలోకి, రక్తంలోకి, మెదడులోకి పోతుంది. మళ్ళీ వదిలేది బొగ్గుపులుసు వాయువు. యోగులు, సాధువులు, రుషులు వూపిరి బిగబడతారు. ఇది ఒక అలవాటుగా క్రమేణా అభ్యాసం చేస్తారు. యోగంలో ఇదొక భాగం. ప్రాణాయామం అనే యీ చర్య మోక్ష సాధనలో మెట్టుగా పేర్కొన్నారు. బొగ్గుపులుసు వాయువు ఎక్కువసేపు వూపిరితిత్తులలో, రక్తంలో అట్టిపెడితే, మెదడుకు చాలినంత ప్రాణవాయువు అందదు. మెదడు సాధారణంగా పనిచేయాలన్నా ముఖ్యంగా ఆలోచించాలన్నా ప్రాణవాయువు సహజంగా అందాలి. కృత్రిమంగా మెదడుకు ప్రాణవాయువు తగ్గిస్తే ఆలోచన కూడా తగ్గుతుంది. తొలిదశలో రకరకాల పగటి కలలు, దృశ్యాలు, అర్థంపర్థంలేని ఏవో దృష్టులు గోచరిస్తాయి. అదొక లోకం. కళ్ళు మూసుకొని ప్రాణాయామం ఆచరించేవారికి రంగు దృశ్యాలు, తనకు తెలియని దృష్టులు కనిపిస్తాయి.

ఇది కేవలం ప్రాణాయామం చేసేవారికే పరిమితం కాదు. మతం, దైవం పేరిట ప్రార్థనలు, భజనలు, కీర్తనలు, ఆరాధనలు, సంగీతాలు చేసేవారికీ దృశ్యాలు కనిపిస్తాయి. ఇలా చేసేవారందరూ వూపిరి తక్కువగా పిలుస్తూ, ఎక్కువగా బొగ్గుపులుసు వాయువు అట్టిపెడుతూ, గాలి ఎక్కువగా వదులుతుంటారు. అందుకే బాబాలు భక్తులచే గీతాలాపనలు చేయిస్తుంటారు. చెప్పిందే చెప్పేటట్లు పునరుశ్చరణ (రాం-రాం-సీతారాం వంటివి) గంటలకొద్దీ పాడిస్తారు. అలసట వచ్చేటంతగా యీ పనిచేసేసరికి, గుంపులో వున్నవారు ఆలోచించలేరు. ఇదొక సామూహిక మనస్తత్వం. వారికి ఇష్టదైవం కనిపిస్తున్నట్లు ఏవో దృశ్యాలు చూస్తున్నట్లు అనిపిస్తుంది. దీనినే మధురానుభూతిగా చిత్రిస్తారు. రజనీష్ ఆశ్రమంలో యిలా సామూహిక భజనలు, ప్రార్థనలు, నృత్యాలు జరపడం తెలిసిందే. కొలువులో పూనకాలు రావడం, అరుపులు కేకలతో ఎగరడం ఇలాంటి చర్యే. ఈ విధంగా జరిగినప్పుడు దృశ్యాలు చూచేవారికి తాత్కాలిక "మధురానుభూతులు" కలిగినా, క్రమంగా సాధారణ స్థితికి వస్తారు. అంటే వూపిరి మామూలుగా పీల్చుకుంటారన్నమాట.