పుట:Abaddhala veta revised.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మనువుచేసిన ఛండాలమంతా బయట పెట్టాడు. మనదేశంలో విప్లవ ప్రతీఘాతుకం మనువుతోనే వచ్చిందన్నాడు. అంటరానితనం మనువునుండే ఆరంభమైనదన్నాడు. ఆడవాళ్ళకు స్వేచ్ఛ పోవడం, హక్కులు పోవడం మనువుతోనే మొదలయ్యాయన్నాడు. అలాంటి చండాలపు మనువుతో అంబేద్కర్ ను పోల్చడం పరోక్షంగా ఆయన్ను అవమానపరచడమే.

మన రాజ్యాంగాన్ని తగులబెట్టాలని అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాల్గొన్నప్పటికీ, తనకు యిష్టం లేనివి ఎన్నో చోటుజేసుకోవడంతో ఆయన అలా భావించాల్సి వచ్చింది. కనుక రాజ్యాంగంలోవున్న వాటన్నిటికీ అంబేద్కర్ ను బాధ్యుడుగా చేయడమూ భావ్యంకాదేమో.

అంబేద్కర్ ఆరంభించిన కృషి అడుగడుగునా అగ్రకులాల అవరోధాలతో వెనుకంజ వేసింది. కనుక రాజకీయ, ఆర్థిక, మత ప్రలోభాలకు లొంగక, మానవహక్కుల నిమిత్తం పోరాడటం, అంబేద్కర్ లక్ష్యాలను సాధించడానికి కృషిచేయడమే.

- హేతువాది, మే 1991
దివ్యశక్తులు వుంటే
హేతువాదులకు అభ్యంతరమేమిటి?

మన యోగులు తపస్సు చేసి దివ్యదృష్టిని సాధించినట్లు, శక్తులు పొందినట్లు చెబుతారు. వారు ఏమిచేశారో ఎలా సాధించారో వివరాలు తెలియవు. శరీరాన్ని శుష్కింపజేసి కఠోరదీక్ష చేసినట్లు చదివాం. ఇప్పటికీ అలా చేస్తే గొప్ప సాధన సాధ్యమని భావిస్తున్నారు. ఇదంతా ఆధునిక సమాజంలో గందరగోళానికి దారి తీస్తున్నది. నేడు సాధువులున్నారు. వారు సమాజానికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. జనంలో వారిపట్ల నమ్మకాలు, భయాలు వున్నాయి. సాధువులు తమ శక్తులు ప్రదర్శించి జనాన్ని హడలెత్తించి కాలం గడుపుతున్న వారున్నారు. రాజకీయ నాయకులు సైతం సాధువుల్ని ఆశ్రయించి ప్రయోజనాలు ఆశిస్తున్నారు. జనం ఎవరి పనుల్లో వారుంటూ, ఎప్పుడైనా ఒకసారి తీర్థయాత్రలకు వెడుతూ సాధువుల్ని కలుసుకోవడం మహాత్యాలు చూచి, నమ్మి మొక్కడం సహజం. ఈ మహాత్యాల వెనుక ఏముంది, ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకోడానికి ప్రయత్నించరు. చిన్నప్పటి నుండే నమ్మకాలతో పెరగడంవలన, సాధువుల చర్యలు దివ్యశక్తులుగా కనిపిస్తాయి.

చదువుకున్నవారు సైతం మొక్కుతున్నారు. కాళ్ళమీద పడుతున్నారు, వాళ్ళకంటే మీరు గొప్పా అని అడిగే వారున్నారు. చదువుకున్నవారూ చదువుకోనివారూ అనే తేడా నమ్మకాల విషయంలో పనిచేయదు. ఒక విషయం బాగా చదువుకొని, డిగ్రీ తెచ్చుకొని, పెద్ద ఉద్యోగంలో వున్నంత మాత్రాన మిగిలిన విషయాలన్నీ తెలియాలనేమీ లేదు. ఇతర రంగాలలో కూడా