పుట:Abaddhala veta revised.pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఫలితాలను ప్రచురించారు. శూద్రులెవరు అనే అంశం తీసుకొని,వేదకాలం నుండీ వర్ణాలుగా విభజించి చీల్చిన విషయాలను చూపారు. వేదాలలో వర్ణాలు లేవనే వారి వాదనని ఖండించారు. వర్ణాలు, కులాలు వేరని చూపి, సమర్ధించుకొనే ధోరణులు కూడా అంబేద్కర్ ఖండించారు. ఈ విషయంలో ఆర్యసమాజ్, గాంధి మొదలైన వారంతా అంబేద్కర్ విమర్శలకు గురైనారు. చారిత్రకంగా బ్రాహ్మణులు నిర్వహించిన పాత్ర వివరంగా పరిశీలించాడు.

అంటరానివారంటూ మనువుకు పూర్వం లేరనీ, గుప్తుల కాలం నుండీ యీ జాడ్యం అమలులోకి వచ్చినట్లు అంబేద్కర్ చూపారు. మను ధర్మశాస్త్రాన్ని బాగా పరిశీలించి, ఖండించారు. ఆమాటకొస్తే ధర్మశాస్త్రాలలోవున్న హెచ్చుతగ్గుల ప్రస్తావన, అమానుష ధోరణులు అంబేద్కర్ విమర్శలకు గురైనాయి. హిందువులకు, బౌద్ధులకు జరిగిన సంఘర్షణలో అంటరానివారు ఏర్పడినట్లు, అలాగే గోవధ నిషేధంకూడా మతపరం చేసినట్లు చూపారు.

హిందూ సమాజంలో ప్రజాస్వామిక లక్షణాలు, మానవహక్కులు లేవని, ఉండడానికి వీల్లేదని సోదాహరణగా అంబేద్కర్ తెలిపారు. సమానత్వం సోదరత్వం, స్వేచ్ఛలకు హిందూమతంలో తావులేదన్నారు. హిందూమతం అనేది కలగాపులగం అనీ, క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధంలవలె నిర్దుష్టంగా నిర్వచించ వీల్లేదనీ విపులీకరించారు.

హిందువులలో భాగంగా అంటరానివారిని పరిగణించినంతకాలం వారికి విమోచన, సమానత్వం, స్వేచ్ఛ రాదని అంబేద్కర్ నిర్ధారించారు. అందుకే వారికి ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలన్నారు.

రాజకీయాధికారం లేనిదే, అంటరానివారికి హక్కులు ఏర్పడవనీ, బానిసలకంటె అధములుగా వారిని చూస్తారని అంబేద్కర్ పేర్కొన్నాడు.

ఆచరణలో, రాజకీయవాదులు కేవలం ఓట్ల కోసం అంటరానివారిపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు అంబేద్కర్ గ్రహించారు. ఇందులో అగ్రగణ్యుడు గాంధీజీగా ఆయన పసిగట్టి పోరాడారు. గాంధీ చెప్పే మాటలకు, చేసేవాటికి ఎలా పొంతనలేదో చూపారు. హిందువులలోనే అంటరానివారిని అట్టిపెట్టి, శాశ్వత వెట్టిచాకిరీ చేయించుకొనే ధోరణిని గాంధీ సమర్ధించారన్నారు. బౌద్ధంలో మాత్రమే సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం లభించగలవని అంబేద్కర్ నమ్మారు. బౌద్ధం మనదేశంలో ఏనాడో చంపేయబడింది. దీనిని పునరుద్ధరించడం చాలా కష్టమని అంబేద్కర్ గ్రహించలేదు. మానవ హక్కులకై అంబేద్కర్ పోరాటం ముందుకు సాగించవలసివుంది.

అంబేద్కర్ మనువా?

అంబేద్కర్ ను తరచు మనువుతో పోల్చి, ఆధునిక రాజ్యాంగనిర్మాత అనీ, ఆధునిక మనువు అనీ నాజూకుగా తిడుతుంటారు. జీవితమంతా అంబేద్కర్ ఎన్నో పరిశోధనలు చేసి