పుట:Abaddhala veta revised.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గౌరవించడం సాధ్యం కాదని గ్రహించాలి. కాంగ్రెస్, జనతాదళ్ ఒక తానులో వస్త్రాలే. ఎటొచ్చీ బి.జె.పి. కొంచెం భిన్నమైంది. ముగ్గురూ కలసి అంబేద్కర్ వాదాన్ని తియ్యని మాటల్తో, చేతల్తో ఉరితీయదలచారు. ఈ విషయం అమాయకులైన వారికి అర్థం గావడానికి కొంత సమయం పట్టొచ్చు.

మార్క్సిజం - అంబేద్కర్

అంటరానివారు, శూద్రులు హెచ్చుతగ్గుల సమాజంలో అనుభవిస్తున్న కిరాతక చర్యల్ని గమనించిన అంబేద్కర్ అనేక మార్గాంతరాలను అధ్యయనం చేశారు. ప్రపంచంలో అనేక మందిని ఆకర్షించిన మార్క్సిజాన్ని ఆయన పరిశీలించకపోలేదు. బౌద్ధాన్ని, మార్క్సిజాన్ని పోల్చి కూడా అంబేద్కర్ చూచాడు.

శాస్త్రీయ సోషలిజంగా తన సిద్ధాంతాన్ని నిలపదలచిన మార్క్స్ అది విధిగా వచ్చి తీరుతుందని భావించినట్లు అంబేద్కర్ విశ్లేషించాడు. కాని 1917లో రష్యాలో వచ్చిన విప్లవం మార్క్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా రాలేదన్నాడు. అది విధిగా సంభవించలేదంటే, ఎంతోహింస, రక్తపాతం జరిగిందనీ, మానవ ప్రయత్నం వలన రష్యాలో విప్లవం వచ్చిందనీ అంబేద్కర్ చెప్పారు. చరిత్రను ఆర్ధిక దృక్పధంతో చూడడం సరైనది కాదని రుజువైందని కూడా అంబేద్కర్ స్పష్టం చేశారు. క్రమేణా కార్మికుడు పేదరికంలోకి పయనిస్తున్నట్లు కూడా సిద్ధాంతీకరించడాన్ని ఎవరూ అంగీకరిచడం లేదన్నారు. ప్రపంచాన్ని పునర్నిర్మించడమే తత్వం చేయాల్సిన పని అని మార్క్స్ చెప్పింది సరైనదిగా అంబేద్కర్ భావించారు. వర్గాలమధ్య సంఘర్షణవున్నట్లు మార్క్స్ అన్నది వాస్తవం. వ్యక్తిగత ఆస్తివలన ఒకరు శక్తివంతమైన వర్గంగా, దోపిడీ వలన పరిణమిస్తున్నారు. ఈ వ్యక్తిగత ఆస్తిని తొలగించి సమాజం శ్రేయస్సును కాపాడాలి.

ఈ లక్ష్యాలను సాధించడానికి మార్క్స్, హింసను, కార్మిక నియంతృత్వాన్ని సూచించగా, బుద్ధుడు అహింసను, మానసిక మార్పును అవలంబించాడు.

మార్క్సిజంలో రాజ్యపరమైన సిద్ధాంతం బలహీనమైనదని, శాశ్వతంగా నియంతృత్వాన్ని అది సూచిస్తున్నదనీ అంబేద్కర్ విమర్శించాడు. రాజ్యం హరించిపోతుందని చెప్పినా అది ఎన్నడు జరుగుతుందో, అలా జరిగిన అనంతరం ఏమౌతుందో స్పష్టపరచలేదన్నాడు.

రష్యా విప్లవం సమానత్వాన్ని సాధిస్తుందని ఆహ్వానించాం. కాని స్వేచ్ఛ, సౌభ్రాతేత్వం లేని సమానత్వం సమాజానికి అనవసరం. కమ్యూనిజంలో ఇవి లేవు గనుక తృణీకరించాలని అంబేద్కర్ అన్నాడు.

ముగింపు

అంబేద్కర్ భారత సమాజాన్ని విభిన్న కోణాల నుండి క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశోధనా