పుట:Abaddhala veta revised.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునిక హేతువాద ధోరణికి మతవిమర్శ ఒక భాగంకాగా, శాస్త్రీయ దృక్పధం రెండవభాగంగా వున్నది. ఈ పద్ధతిని పాటిస్తూ తెలుగులో రచనలు చేస్తున్నవారు మల్లాది రామమూర్తి, రావిపూడి వెంకటాద్రి, ఆవుల సాంబశివరావు, కీ॥శే॥నార్ల వెంకటేశ్వరరావు. మతాలన్నీ మానవుడికిగాక దైవానికి కేంద్రస్థానం కల్పించాయి. కర్మ,పునర్జన్మ, కులభేదాలు, అంటరానితనం, సతి,స్త్రీపట్ల వివక్ష యిత్యాదులన్నీ మతపరంగా వచ్చాయి. ఉన్నత సంప్రదాయాలుగా పేర్కొన్న వేదాలు, షడ్దర్శనాలు, ఉపనిషత్తులు, గీత, సామాన్యుడి సంప్రదాయాలుగా బహుళ ప్రచారం పొందిన భారత రామాయణ, పురాణాలు సమాజంలోని దోషాలకు ఆమోదముద్ర వేశాయి. వాటిని హేతువాద రచయితలు ఎదుర్కొనడానికి ప్రయత్నించారు. నార్ల వెంకటేశ్వరరావు జాబాలి, నరకంలో హరిశ్చంద్ర, ద్రౌపది, హిరణ్యకశిపుని వధ, సీతజోస్యం యీ కోవకు చెందినవే. అలాగే ఆవుల సాంబశివరావుగారి నాటికలు, విమర్శలుకూడా, మతదోషాల్ని సునిశితంగా పరిశీలించినా కొంత తీవ్రధోరణిలో రావిపూడి వెంకటాద్రి శంకరాచార్యుల తత్వాన్ని, మూఢనమ్మకాలను దుయ్యబట్టారు. ఇవన్నీ చాలా హేతుబద్ధంగా వున్నాయి. క్రైస్తవ, ఇస్లాం, హిందూ మతాల విమర్శలు మల్లాది సుబ్బమ్మ రచనల్లో కనిపిస్తాయి. "జిల్లెళ్ళమూడి అమ్మ" అనే రచన ఎం.వి. రామమూర్తి చక్కని విశ్లేషణ చేసి, బాబాలందరికీ అన్వయించేటట్లు శాస్త్రీయ పరిశీలన చేశారు.

వైజ్ఞానిక దృక్పధం ప్రత్యామ్నాయంగా వుండాలని, మతం స్థానంలో మానవ విలువలు వుండాలని హేతువాదులు ప్రతిపాదించారు. మతం, దైవం లేకుంటే నీతి వుండదనే భయాన్ని కాదంటూ, అవన్నీ మానవుడి సృష్టీ అనీ, మనిషికి వైమనస్యత రాకుండా వుండడానికి మానవ హక్కులు, విలువలు పాటించాలని వీరు తమ రచనలలో చూపారు.

ఇస్లాంమతాన్ని హేతువాద దృక్పధంతో విమర్శించిన మల్లాది సుబ్బమ్మ, వివేకానందను నిశిత పరిశీలనకు గురిచేసిన ఆవుల గోపాలకృష్ణమూర్తి, బైబిల్ బండారాన్ని బయట పట్టినందుకు ఎన్.వి.బ్రహ్మం అనేక నిర్హేతుక విమర్శలకు, చిక్కులకు లోనుగావలసి వచ్చింది. అయినా సాహిత్యంలో ఔచిత్యం కావాలని వీరు పట్టుబట్టారు.

హేతువాదం వేమనలో తొంగిచూడగా, వెంకటేశ్వరరావులో పరిపక్వతను అందుకోగా, వెంకటాద్రిలో శాస్త్రీయ పంధాలో సాగింది. హేతువాదం ఒక తాత్విక దృక్పధంగా అవగాహన అయిన తరువాత, అది కవితలో, నాటకంలో, నవలలో, సామాజిక, సాంకేతిక శాస్త్రాలలో, విమర్శలలో జీవం పోసుకుంటుంది.

మూఢనమ్మకాలు చాలా హాయిని సమకూర్చిపెడతాయి. కొందరు రచయితలు వీటిని బాహాటంగా తమ రచనలలో ప్రవేశపెట్టగా పాఠకుల్ని ఆకర్షిస్తున్నాయి. కాని ఇది మనిషి పురోగతికి పనికిరాదు. అందుకే హేతువాదం యిలాంటి రచనల్లోని మూఢత్వాన్ని ఖండిస్తుంది. నమ్మడం మొదలెడితే దేన్నైనా నమ్మొచ్చు. రుజువు అవసరం లేనప్పుడు, కర్మ, పునర్జన్మలపైన అన్నిటినీ