పుట:Abaddhala veta revised.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామారావు కృషి చేశారు. రెడ్లు దీనిని వ్యతిరేకించారు. కాపులు యింకా విజృంభించి కమ్మద్వేషం పెంచుకున్నారు. వంగవీటి మోహనరంగా హత్యతో కాపు-కమ్మ ద్వేషం పరాకాష్టకు చేరింది. కర్ఫ్యూ కూడ ఆపలేని కలహాలు, హత్యలు జరిగాయి. కమ్మరాజ్యంలో కాపు సంఘాలు తామర తంపరగా వెలిశాయి. రెడ్లు, బ్రాహ్మణులు కాపులతో చేతులు కలిపారు. బ్రాహ్మణుల్ని దెబ్బతీసే ప్రయత్నంలో బౌద్ధాన్ని తిరగదోడడానికి రామారావు ప్రయత్నించారు. కంచి శంకరాచార్య మొదలు బ్రాహ్మణులు దినికి శాపనార్థాలు పెట్టారు. వంశపారంపర్యంగా వస్తున్న గ్రామాధికారులను తొలగించడానికి రామారావు చేసిన ప్రయత్నం కూడా బ్రాహ్మణుల్ని దెబ్బతీయడానికేనని మరో కమ్మ నాదెండ్ల భాస్కరరావును అడ్డం పెట్టుకొని తాత్కాలికంగా విఫలమైన తరువాత ఎన్నికలలో రెడ్డి-కాపు-బ్రాహ్మణ కలయికతో కమ్మనాయకత్వాన్ని వూడగొట్టగలిగారు.

రిజర్వేషన్ల పేరిట రాష్ట్రంలో, కేంద్రంలో జరిగే కాండ అంతా కులోద్ధరణకు ఉపకరించింది. ఓట్ల కోసం జరిగే ప్రయత్నంగా మిగిలింది తప్ప ఇందులో మరో దృష్టి కనిపించలేదు. మండల్ కమీషన్ నివేదికతో అగ్రకులాల నిజస్వరూపం బయటపడింది. కులాధిక్యతను మెరిట్ పేరిట వారు వెల్లడించారు. ఈ ధాటికి తక్కువ కులాలవారు నిలవలేకపోయారు. రాష్ట్రంలో మురళీధరన్ కమీషన్ నివేదిక అమలుపరుస్తానని రామారావు అన్నప్పుడే యీ అగ్రకులాల ధోరణి వెల్లడైంది. అదే దేశవ్యాప్తంగా కనిపించింది. అంబేద్కర్ పేరిట జరుగుతున్న మోసం కూడా యీ రీతిలోనే వున్నది. హిందూ మతం కులాన్ని కట్టుదిట్టం చేసింది గనుక అదిపోతేగాని కులం పోదని చెప్పిన అంబేద్కర్ రాజకీయ పార్టీలకు అవసరం లేదు. ఆయన్ని అడ్డం పెట్టుకొని విగ్రహాలు వేసి, ఆరాధనలు చేసి, దండలు వేసి, నినాదాలతో షెడ్యూలు కులాల వారిని ఆకర్షించే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఆ వూబిలో పడి కొట్టుకుంటున్న షెడ్యూలు కులాల నాయకులు నిజాన్ని గ్రహించలేక, వేసిన మేత వరకే తృప్తిపడుతున్నారు. అంటరానితనం వూరి వెలుపల అలాగే కొనసాగుతున్నది. మాల మాదిగ కొట్లాటలతో వారూ సతమతమౌతున్నారు. రాజకీయవాదులు యీ బలహీనతల్ని బాగా వాడుకుంటున్నారు. రాజ్యాంగంలో రాసుకున్న అంటరానితన నిషేదం అక్కడికే పరిమితమైంది. పదవులు పొందిన షెడ్యూలు కులాల నాయకులు ఉద్యోగాలలో వున్నవారు అంతవరకే చాలు అనుకుంటున్నారు. అంబేద్కర్ ను వీరు చదవలేదు, చదివినా అంతుపట్టలేదు. రాజకీయాలలో చాలాకాలం మోసం చేయవచ్చు అని షెడ్యూల్ కులాల వారు గ్రహించలేకపోవడం గమనార్హం. బుద్ధుడ్ని అవతారం చేసి చంపినట్లే అంబేద్కర్ ను హతమార్చేస్తున్నారు. ఇది మతపరంగా చాకచక్యంతో జరుగుతున్న కులయజ్ఞమే. ఒక మంత్రి లేదా శాసనసభ్యుడు శాసనాలు రాష్ట్ర ప్రజలందర్ని వుద్దేశించి చేస్తాడు. ఎన్నికలలో ప్రజలు ఓటర్లుగా పాల్గొంటారు. కనుక గెలిచినవారు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం మానవ హక్కుల్ని అంగీకరించి అందరికి న్యాయం చేకూర్చుతానంటుంది. అందులో కులప్రసక్తి లేదు కనుక మంత్రిగాని శాసనసభ్యుడు గాని కులసభకు వెళ్ళి పాల్గొని ప్రోత్సహించడం రాజ్యాంగవిరుద్ధం, అన్యాయం, నేరం కూడా. అందరికీ పరిపాలన అందించాల్సిన మంత్రి ఒక్క కులాన్ని సమర్ధించరాదు.