పుట:Abaddhala veta revised.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రజ్ఞులు జ్యోతిష్యంలో నిజం వున్నదేమోనని పరిశిలించారు. కాని రుజువులకు, శాస్త్రీయ పద్ధతికి ఎక్కడా జ్యోతిష్యం నిలవడం లేదు.

పత్రికలలో కూడా వారఫలాలు, దినఫలాలు పేరిట రాస్తున్న వాటిని చదువుకొని, నిజమేనని నమ్మి మోసపోతున్నారు. సుప్రసిద్ధ సైంటిస్టు, ఖగోళ శాస్త్రజ్ఞుడు కారల్ సాగన్ జ్యోతిష్యం మోసపూరిత భ్రమ అని స్పష్టంగా ప్రకటించారు. అమెరికాలో అలౌకిక శక్తుల్ని పరిశోధిస్తున్న సంఘంవారు పత్రికలకు రాస్తూ, వారఫలాలు, దినఫలాల అడుగున "ఇది కేవలం వినోదం నిమిత్తం ఉద్దేశించామని" ప్రకటించమని కోరారు. కొన్ని పత్రికలు అసలే జ్యోతిష్యాన్ని మానేశాయి.

మనదేశంలో జ్యోతిష్యులు ఆధారపడే నవగ్రహాలు వాస్తవంగా లేవు. రాహువు, కేతువులనేవి కేవలం నీడలు అని తెలుసుకున్నారు. చంద్రుడు మాత్రం భూమికి ఉపగ్రహంగా గ్రహించారు. నక్షత్రంగా స్వయంప్రకాశం గల సూర్యుడిని కూడా మనవాళ్ళు గ్రహాలలో చేర్చారు. ఏ గ్రహానికి స్వయంగా వెలిగే శక్తి లేదు.

నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో అనే గ్రహాలు కనిపెట్టారు. కాని అవి భారతీయ జ్యోతిష్యంలో చేర్చలేదు. వాటి ప్రభావం ఏమౌతుంది?

సూర్యుడి నుండి 8 నిమిషాలకు కిరణాలు భూమి మీదకు వస్తాయి. ఇందులో ఏ కిరణం ఆధారంగా పుట్టుకను నిర్ణయిస్తారు.

మన జ్యోతిష్యం ఆధారాలు లేని మూఢనమ్మకం. ఇది ఆచారంగా వస్తున్నది. పరిశోధన జరగలేదు.

మన శక్తిపై మనకు విశ్వాసం లేనప్పుడు ఇతరులు చెప్పే జ్యోతిష్యంపై ఆధారపడతాం.ఇది మనల్ని కృంగదీస్తుంది. మానసిక వికాసాన్ని అరికడుతుంది. ప్రశ్నించే తత్వాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఖగోళశాస్త్రం ఏనాడో జ్యోతిష్యాన్ని అటకపై పెట్టి, మానవుల్ని ముందుకు తీసుకపోయింది.

మనదేశంలో అభివృద్ధి కుంటుతుండడానికి జ్యోతిష్యం వంటి మూఢనమ్మకాలే ప్రధాన కారణం. అబ్రహాం కోవూరు వంటివారు జ్యోతిష్యుల్ని ప్రశ్నిస్తూ అనేక సందర్భాలలో రుజువుకై నిలబడమన్నారు. కాని ఎవరూ ముందుకు రాలేదు.

జ్యోతిష్యులు చెప్పే రాశిచక్రాలకు శాస్త్రీయాధారాలేవీ లేవు. విద్యుదయస్కాంతం,గురుత్వాకర్షణ,న్యూక్లియర్ శక్తులు కనుగొన్నారు. వీటి ప్రభావం జనంపై ఎలా వుంటుంది అనేది జ్యోతిష్యానికి బొత్తిగా తెలియదు. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్టు పెట్టెలపై వేస్తున్నారు. అయినా కొందరు తెలిసే పొగ పీల్చేస్తున్నారు. అలాగే జ్యోతిష్యం శాస్త్రీయంగా కాదు. కేవలం వినోదం మాత్రమేనని ప్రకటిస్తే-అయినా సరే నమ్ముతాం అనే వాళ్ళను నమ్మనివ్వండి.