పుట:Abaddhala veta revised.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశ్నవేస్తే, అలా అడగకూడదు, కళ్ళు పోతాయి అనే తల్లిదండ్రులు పిల్లల పట్ల ద్రోహం చేస్తున్నారనేది సారాంశం. కొన్ని ప్రశ్నలు యిబ్బంది పెడతాయి. సమాధానాలు తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కనుక పిల్లల నోరుమూయించడం భయపెట్టడం కొట్టడం మార్గాంతరం కాదు.

చిన్నప్పుడు అలా జిజ్ఞాసను అణచివేస్తే పెద్ద అయిన తరువాత, సైంటిస్ట్ కు సైతం మనోవికాసం వుండదు.

హక్కులు పిల్లలకు వున్నాయని ఇన్నాళ్ళు తెలియకపోవడం తప్పుకాదు. తెలిసిన తరువాత అమలు చేయకపోవడం పిల్లలపట్ల అపచారం.

పాఠాల్లో పిల్లల హక్కుల ప్రచురించి ప్రచారంలోకి తేవడం కనీస కర్తవ్యం. తదనుగుణంగా మీడియా ప్రసారాలు స్పందించడం అవసరం. ఇందుకు పిల్లల పట్ల పెద్దలకు గల మానసిక గూడు తొలగించాలన్న మాట.

- జనబలం, 7 జూలై, 2002
అపూర్వ అన్వేషణా కేంద్రం

నయగరా వద్ద "సెంటర్ ఫర్ ఇంక్వయిరీ" అనే పేరిట యీ ప్రపంచ అన్వేషణా కేంద్రం నెలకొన్నది. ఇతర యాత్రాస్థలాల వంటిది కాదు. ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. కొత్త ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతాయి.

ఇక్కడ ప్రపంచం మొత్తం మీద ఇంగ్లీషులో ప్రచురించిన హేతువాద, మానవవాద, సందేహవాద, నాస్తికవాద జిజ్ఞాస గ్రంథాలన్నీ కలిపి ఒక గ్రంథాలయంగా ఏర్పరచారు. ఇంకా సేకరణ సాగుతున్నది. క్రమేణా స్పానిస్, ఫ్రెంచి తదితర భాషలకు సైతం యీ సేకరణ విస్తరిస్తారు. పుస్తకాలేగాక, వివిధ పత్రికలు కూడా పాతవి ఇక్కడ భద్రపరుస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా జనాన్ని రకరకాలుగా మోసం చేయడం,వారిని మాయచేసి డబ్బు రాబట్టడం, మూఢనమ్మకాలను స్థిరపరచడం, వ్యాధులను నయం చేస్తామనడం, అతీంద్రియ శక్తుల బూచి చూపడం తెలిసినదే. ఒక్కమాటలో అదంతా బూటకం అని కొట్టిపారెయ్యకుండా, అన్ని రంగాల నిపుణులతో సంఘాలు ఏర్పరచారు. ప్రపంచంలో ఏ మూల ఇందుకు సంబంధించిన సమాచారం లభించినా స్వీకరిస్తారు. నిజానిజాలు నిగ్గు తేలుస్తారు. ఇందులో మొదటి సంఘం జ్యోతిష్యానికి చెందింది. ఇ.డబ్ల్యు. కెల్లీ ఈ సంఘాధ్యక్షుడు. జ్యోతిష్యాన్ని శాస్త్రీయంగా పరిశీలించడం,వారు చెప్పేది ఎంతవరకు నిలబడుతుందో? ప్రపంచానికి చెప్పడం వీరి ఉద్దేశం. ఎక్కడ, ఎవరు సత్యమని చెప్పినా, అందుకు శాస్త్రీయాధారాలు చూస్తారు. పరీక్షకు నిలిస్తే ఒప్పుకున్నట్లు లోకానికి చాటి చెబుతారు. లేకుంటే లేదంటారు.