పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుగ్రహించి ఒక గంటో లేక మరికొంతసేపో ఆలస్యంతో చిన్ని పడవలమీద అతడు హీలింగ్‌కు పంపించేవాడు. తిరిగివస్తూ పడవలు కొలంబస్, సిన్సినాటి, టాయివిల్లీ నుంచీ సెయింట్ టాయీ ఇంకా ఇతరప్రదేశాలనుంచీ కొల్లకొల్లలుగా వార్తలను తీసుకొవచ్చాయి. వార్తాప్రసరణ ఒక వారానికి మించి నిలిచిపోని రీతిగా ఆండీ ఈ వార్తల నన్నింటినీ ప్రసారం చేశాడు.

అతడు అక్కడ వున్న సమయంలోనే సిన్సినాటి, ల్హీలింగులలో అమ్ముదామనే ఉద్దేశంతో కొన్ని బల్లగుడ్డలను తీసుకొని నదిమీదుగా తాను వస్తున్నట్లు తండ్రిదగ్గిర నుంచి ఆండీకి ఒక ఉత్తరం వచ్చింది. ఆండీ పడవవచ్చే సమయానికి రేవుదగ్గిరికి వచ్చాడు. తండ్రికోసం కొద్దిసేపు వెతుక్కొని, కనిపించిన తరువాత వొడ్డుకు రమ్మని సైగ చేశాడు. విలియం క్రింధ డెక్కుమీద సామానులను ఎక్కించే వొక మూలకు దారితీశాడు.

"దొంగభయంవల్ల మూటలదగ్గిర నుంచీ ఎక్కువదూరం వెళ్ళటం నాకిష్టం లే"దని అతడు అందుకు కారణం చెప్పాడు.

"నీ కొక గది అంటూ లేదా"అని కొడుకు జంకుతూ అడిగాడు.

"లేదు ఖర్చు తగ్గించవలెనని ఉద్దేశించాను. అందువల్ల నేను డెక్కమీదనే ప్రయాణం చేస్తున్నా" నన్నాడు.

ఆ మాటలు వినటంతోటే "అలాగా నాన్నా!" అంటున్నప్పుడు ఆండీ గొంతుక గాద్గద్యం వహించింది.