పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇది ముద్రణవిషయంలో అతడు చేసిన మొదటి సాహసం. ఒకమారు చవిచూశాడు గనుక తరువాత అతడు తరుచుగా పత్రికలకు వ్రాస్తుండేవాడు. లైబ్రేరియన్ వెంటనే 'దానం ఎవరికోసమయితే వుద్దేశింపబడ్డదో ఉచిత వినియోగదారుల పట్టికను వారివరకే పరిమితం చెయ్యవలసి వచ్చింది' అని పత్రికద్వారానే సమాధానమిచ్చాడు. ఊహించటానికి వీలున్నట్లే అతడు దీన్ని ఖండిస్తూ మరొక లేఖ వ్రాశాడు. అందులో అత డిలా వ్రాశాడు. "ఈ దానం ఎప్రంటిస్‌ల కొర కన్నప్పుడు శబ్ధార్థాన్ని నిష్కర్ష చేయటం జరిగిందా! వ్యాపారాన్ని నేర్చుకొంటూ బౌండు అయిన వారికి మాత్రమే వుద్దేశింప బడ్డదా లేక బౌండు అయినా కాక పోయినా శ్రామిక బాలుర కందరికీ వుద్దేశింపబడ్డదా అన్నది ప్రశ్న. ఇందులో మొదటిదే సత్యమని అంటే మేనేజర్లు ఉదారుడైన దాత ఉద్దేశాన్ని అపార్థంచేసుకొన్నారన్నమాటే - శ్రామిక బాలుడు."

ఈ లేఖ ప్రచురితమయిన తరువాత లై బ్రేరియన్ కల్నల్ ఆండర్ సన్‌తో బేటీ జేసి వుంటాడు. తరువాత మూడు రోజుల్లో డిస్పాచ్ పత్రిక సంపాదకీయపు పుటలో "బౌండు కాని శ్రామిక బాలుడు ఈ కార్యాలయానికి విచ్చేయవలసిందని ప్రార్థన" అన్న పంక్తి ఒకటి ప్రచురితమయింది.

ఆండి వెళ్లాడు. అతణ్ని లై బ్రేరియన్‌ను కలుసుకోవలసిందనీ, పై సూత్రాన్ని సడలించారనీ, అందువల్ల ఎప్రంటిస్ లు కాకపోయినప్పటికీ కార్మికబాలు రందరూ ఉచిత వినియోగదారుల పట్టికలో చేరుతారనీ చెప్పటం జరిగింది.