పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సలెం ఎటువంటిదో నాకు డన్ఫ్‌ర్మ్‌లైన్‌సర్వం అటువంటిది. అప్పుడు అమెరికాను గురించి అతడికి ఉత్సాహ భావమేమీ కలగలేదు - బ్రూస్ లేడు, వాలెస్ లేడు, బరన్స్ లేడు, పరికించి చూస్తే గర్వించి చెప్పదగ్గ వీరులు లేని దేశం. తుది రాత్రి, తుది ఉదయ భోజనం, తుదిగా వినిపించిన అబ్బీ గంటల తియ్యని చప్పుడు డన్ఫ్‌ర్మ్‌లైన్‌లోని ఆనాటి ప్రతి అంశం అతనికి హృదయవిదారక మైంది.

తన బాల్యాన్ని గడిపిన ఇంటివైపుకు వెన్ను త్రిప్పిన తారీఖును - మే 18. 1848 - అతడు ఎన్నడూ మరచిపోలేదు. అప్పుడు అతని వయస్సు పదమూడు సంవత్సరాలు. అందమయిన అతని చిన్న తమ్ముడు ధామస్ మోరిసన్ వయస్సు అయిదేండ్లు ఫోర్తు అ గంలో వున్న నౌకాశ్రయానికి వెళ్లుతున్న దారిలో పెట్టెబండి కిటికీలోంచి చెమ్మగిల్లేకన్నులతో అడ్డువచ్చిన కొండను క---గాదృష్టినిదూరంచేసిదాచివేస్తున్న డన్ఫ్‌ర్మ్‌లైన్‌లోని కొండ గుర్తులను అన్నిటినీ, తుదిగా అతిపురాతనమైన అబ్బీ శిఖరాన్ని వెనక్కితిరిగినిలబడి చూశాడు. అంకుల్ లాడర్, డాడ్, అంకుల ధామస్‌లు వారిని సముద్రతీరందాకా అనుసరించారు. రేవు చేరగానే ఆండ్రూ హఠాత్తుగా అతి వేగంతో అంకుల్ లాడర్ దగ్గిరికి వెనక్కు వెళ్ళి "అబ్బా! నిన్ను విడిచిపెట్టలేను, నిన్ను విడిచిపెట్టలేను" అని ఏడుస్తూ చేతులతో అతణ్ని చుట్టవేశాడు. ఎవరో నెమ్మదిగా అతణ్ని విడిపించి తీసుకుపోయి నావ ఎక్కించారు. స్వదేశాన్ని విడిచిపెట్టి నవ ప్రపంచంతో వారి యాత్ర ప్రారంభమైంది.