పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మోర్లే వాళ్ళను పంపించడానికి వెంట వచ్చాడు. అన్యోన్య శ్రద్ధగల ఆ మిత్రు లిద్దరూ కరచాలనం చేసి సెలవు చెప్పుకొన్నారు. అదే వారి తుదిసారి కరచాలనం.

తరువాత కార్నెగి బలం, తేజం, నెమ్మది నెమ్మదిగా తరిగిపోవటం ప్రారంభించాయి. 1915 లో మెయిన్ లోని బార్ హార్బర్‌లోను, తరువాతి వేసగిని కెనక్టికట్ లోనీ నోరోటన్‌లోను గడిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు యుద్ధంలో ప్రవేశించిన తరువాత కార్నెగీ ముప్పదిరెండు సైనిక శిబిరాలకు గ్రంథాలయాలను ఏర్పాటు చేశాడు. 1917 ప్రారంభంలో అతడు లెనాక్స్ దగ్గర వున్న బెర్క్‌షైర్ కొండల్లోని 'షాడోబ్రూకె' అన్న మీరాసీ (Estate) ని కొన్నాడు. చివరి మూడు వేసగి కాలాలను అతడు అక్కడే గడిపాడు. చార్లీస్క్వాబ్, టామ్ మిల్లర్, మార్క్‌ట్వైస్, రిచ్చర్డ్ వాట్సన్ గిల్డర్, జాన్ బిగలౌ, జీసస్ బొయట్ లు మరణించారు. చార్లే యింకా సజీవుడు. ఈ మిత్రు లిరువురూ ప్రతి ఆదివారం ఒకరి కొకరు వుత్తరాలు వ్రాసుకుంటుండేవారు.

ఏప్రియల్ 22, 1919 మార్గరేట్ ను - నిన్న మొన్నటివరకూ స్కిబో పర్వతప్రదేశపు కోనల్లో తండ్రి చేయి పట్టుకొని మెల్లగా వెంట వచ్చిన చిన్న పిల్ల - రోజ్ వెల్ మిల్లర్ అనే మంచి న్యూయార్క యువకుడి కిచ్చి వివాహం చేశారు. ఇదే ఆమె తండ్రి యింట జరిగిన చివరి శుభకార్యం.