పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాలను సాధించడానికి అతిశక్తిమంతమయినదని రూఢిగా నిరూపితమయింది. ధనాన్ని వెచ్చించటం వల్లశాంతి లభించేటట్లయితే అతడు దాన్ని నీరులా ప్రవహింప చేసేటందుకు నిశ్చయించుకున్నాడు.

అందువల్ల డిసెంబరు 14, 1910 నాడు అతడు అంతర్జాతీయ శాంతికోసం కార్నెగీ ఎండోమెంటు అన్న ఒక నిధిని ఏర్పాటు చేశాడు. అతడు తలపెట్టిన వాటిలోకల్లా ఒక్క ఈ విషయంలోనే అతనికి కొంత అపజయం కలిగింది. ధర్మకర్త సంఘానికి అధ్యక్షుడుగా అతడు ఎల హూట్‌న్ ఎన్నుకొన్నాడు. ఇత డంటే అతని కెక్కువ మక్కువ. ఇతణ్ని ఎక్కువగా మెచ్చుకుంటుండే వాడు. కార్యక్రమాన్ని నిర్ణయించే పని నంతటీనీ ధర్మకర్తల వివేకానికే విడిచి పెట్టేశాడు.

ధర్మకర్తలు తమకు చేతనయినంత చేశారు. వారు కార్యకలాపా న్నంతటినీ మూడు శాఖలుగా విభజించారు. ఇందులో ఒక శాఖ "ది డివిజన్ ఆఫ్ ఇంటర్‌కోర్స్ అండ్ ఎడ్యుకేషన్! ఇది అంతర్జాతీయ విధానాలను గురించిన భోగట్టాను సంపాదిస్తుంది. అంతర్జాతీయ సుహృద్భావాన్ని వృద్ధి పెంపొందించటం కోసం తగినన్ని ఏజన్సీలను స్థాపించి వాటిని నడిపిస్తున్నది. ఇది వివిధ దేశాలల్లో శాస్త్రనిష్ణాతులయిన విద్వాంసులను రచయితలను పరస్పరం వినిమయం చేసుకొనే ఏర్పాట్టు చేస్తుంది. ఏవైనా శాంతి సంస్థలు పూర్వమే ఏర్పడి వున్నట్లయితే వాటికి తగిన సహాయ మిచ్చి తోడ్పడుతుంది. దీని ఆర్థిక-చరిత్రశాఖ, "ది డివిజన్ ఆఫ్