పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కార్నెగీ పరస్పర విరుద్ధ ధోరణిలో ప్రవర్తించి వుండవచ్చు. అయితే, అతడెల్లప్పుడు తన ఆత్మవిశ్వాసాలకు సన్నిహితుడయి జీవించాడు. అయినా తన అభిప్రాయాల విషయంలో ఎన్నడూ మొండిపట్టు కలవాడు కాడు. అతడిచ్చిన దానాల నన్నిటినీ దానోద్దేశాలను వెల్లడించిన తరువాత మిగిలిన పాలనావ్యవహారాల నన్నింటినీ పాలక వర్గంవారి నిర్నయాలకు విడిచిపెట్టేవాడు. అవి ఆచరణయోగ్యాలు కావని, ఎవరి అభిప్రాయాలకు అతడు విలువ యిస్తాడో వాళ్లు నిర్నయించినప్పుడు తనకు ప్రియమయిన పధకాలను ఎన్నింటినో అతడు వదులుకున్నాడు. కాన్ఫెడరేట్ బాండ్లు ఇందుకు వుదాహరణం. 1880 లో అంతర్యుద్ధపు చివరదశలో, ఓడిపోయిన అమెరికా కాన్ఫెడురేటెడ్ రాష్ట్రాలవారు ధనవిషయకంగా, ఆర్థికంగా, సంపూర్ణ వినాశనాన్ని పొందినపుడు వారు గవర్నమెంటు బాండ్లను ఇందులో ఎక్కువభాగం డబ్బు యూరప్‌ది - పరిత్యజించే విషయంలో నిర్భంధితులైనారు. దక్షిణరాష్ట్రాలను తరువాత తిరిగి సమాఖ్యలో ప్రవేశపెట్టిన తరువాత కార్నెగీ యూరప్‌లో సద్భావాన్ని కలిగిద్దామనే వుద్దేశంతో వాటికి చెల్లించి వేద్దా మన్నాడు. కాని రాజనీతిజ్ఞులు, ధనిక వర్గంవారు, న్యాయనిపుణులు అది చాలాకష్టమని దానివల్ల - సద్భావం కలగటంకంటే, కలత వృద్ధిపొందుతుందని దాన్ని నిర్వర్తించట మేమీ అసాధ్యకృత్యం కాకపోయినా అతికష్టమైన పని అని చెప్పినప్పుడు ఆ బాండ్లు విషయం కార్నెగీ తనకు ఇష్టంలేకపోయినా వదులుకున్నాడు.