పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హీరోండ్ కమీషన్ కధ్యక్షపదవి పూర్వం కార్నెగీకి భాగస్థుడైన చార్లెస్ టైలర్ మీద పడ్డది. మనలోమాట - ఎవరి ఆత్మత్యాగం ఈనిధి నిర్మాణానికి కారణభూతమైందో ఆ వ్యక్తికి ఇతడు బంధువుకాదు. టైలర్ ఇంతకు పూర్వమే పూర్వపు ఉక్కు కర్మాగారంలోని కార్మికులకోసం ఏర్పాటు చేసిన రిలీప్ నిథిని. ఎంతో పూర్వం కార్నెగీ క్రింద పనిచేసిన పెన్సిల్వేనియా రైల్ రోడ్డు కార్మికులకోసం ఏర్పాటు చేసిన ఫండును చూస్తున్నాడు. ఎట్టి దుష్ప్రచారాలనైనా త్రోసిపుచ్చుతూ, ఏ పనికీ ఒక సెంటు ప్రతిఫలం పుచ్చుకోకుండా ఇప్పుడితడు తగిన శ్రద్ధతో, సమర్థతతో ఈ మూడు నిధుల వ్యవహారాలను చూస్తున్నాడు. ఆయనటువంటి వ్యక్తిమీద పూర్వయజమానికి అంతగాఢమైన అనురాగముండుట సహజం. లెహై విశ్వవిద్యాలయానికి భక్తిశ్రద్ధలుగల పూర్వ విద్యార్థి ఇతడు. ఆ విశ్వవిద్యాలయానికి క్రొత్త లాబారేటరీ కావలసి ఉందని చెప్పటం ప్రారంభించాడు. "ఓహో! చార్లీతోగూడా సంబంధం పెట్టుకోటానికి ఇది అవకాశం" అనుకున్నాడు, ఆ లోకోపకారి.

ట్రస్టీలు అలాబొరేటరీకి తాను పేరు పెట్టటానికి అంగీకరిస్తే దానికి కావలసిన ధనాన్ని తా నిస్తానని కార్నెగీ లెహై అధ్యక్షుడు డ్రింకరుకు లేఖ వ్రాశాడు. "తప్పక అంగీకరిస్తా" మని సమాధానం వచ్చింది. దాత దానికి "టైలర్ హాల్" అన్న పేరును ప్రత్యేకించి ఉంచాడు. తరువాత కొంతకాలానికి చార్లి తబ్బిబ్బులు పడుతూ కార్నెగీ దగ్గిరికి వచ్చాడు.