పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతిప్రీతిని ప్రదర్శిస్తుంటే ఆనందం అనుభవిస్తుండేవాడు. ఆ ప్రేమ వాళ్ళ కన్నుల్లో మెరుస్తుంటే తిలకించి పరవశుడౌ తుండేవాడు. తన ఆత్మకధ టిప్పణిలో అతడు ఇలావ్రాశాడు.. "సంపద లేకపోయినా ఇది కావాలి. బహు కోటీశ్వరత్వం కంటె ఇది ముఖ్యం. ఔను, వేయిమారులు ఔను."

మొదటి విందువేళ వారు మిసెస్ కార్నెగీని వెటరన్స్ ఎసోసియేషన్‌లో గౌరవ సభ్యురాలినిగా ఎన్నుకొన్నారు. వెంటనే ఒకరు "చిన్ని మార్గరెట్ ను కూడా ఎన్నుకుందా" మని సూచన చేశారు. ఈ సూచన వెంటనే అంగీకరింపబడింది.

వెటరన్లలో ఒకడయిన చార్లెస్ స్క్వాబ్, ఒకనాటి గ్రామీణ దరిద్ర బాలుడు, నేటి స్టీల్ ట్రస్టు సంస్థకు ప్రధాని రివర్ సైడు డ్రైవ్‌మీద, ఒక బలిష్టమైన సౌధాన్ని నిర్మించాడు. దీన్ని ఇతడు తన కతి ప్రియమైన ఫ్రాన్సులోని లొయిరీ నదిమీది దుర్గపు నమూనా ననుసరించి కట్టాడు. ఇది గోపుర శిఖరాలతో ఒప్పే ఒక గృహ నిర్మాణం.

అతని పూర్వ యజమాని అప్పుడప్పుడూ ఎవరైనా మిత్రుణ్ని "నీవు చార్లీ నూతన భవనాన్ని చూశావా?" అని తనలో తాను నవ్వుకుంటూ అడిగేవాడు. "దానితో పోల్చి చూస్తే నా ఇల్లు చిన్ని కుటీరంలా కనిపిస్తుంది" అనేవాడు.