పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాగస్థులను కలుసుకో" వారి అభిప్రాయాలేమిటో తెలుసుకో అని అతడు ఆదేశించాడు.

ఇతర భాగస్థు లందరూ అమ్మకానికి అంగీకరించారు. స్క్వాబ్ ఆ విషయాన్ని మోర్గస్‌కు తెలియజేశాడు. అప్పుడు ఆ బ్యాంకరు కార్నెగీని టెలిఫోన్ మీద పిలిచాడు. ఇరువురూ శుభాకాంక్షలను చెప్పుకున్న తరువాత అతడు అతి ముఖ్యమయిన విషయాన్ని ఎత్తుకున్నాడు. "మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు దాన్ని గురించి మాటాడగూడదు?" అని ఆ బ్యాంకరు సూచన చేశాడు.

"మిష్టర్ మోర్గస్, ఫిప్టీ ఫష్ట్ స్ట్రీట్ నుంచి వాల్‌స్ట్రీటు ఎంతదూరమో, వాల్‌స్ట్రీటునుంచి ఫిప్టీ ఫష్ట్ స్ట్రీటు అంతే దూరం" అని ఆ ఉక్కు రాజు మధురంగా ప్రత్యుత్తర మిచ్చాడు.

"అందులో వున్న అంతరార్థ మేమిటో మోర్గస్ వెంటనే గమనించాడు. ప్రపంచంలోని ఉక్కు ఉత్పత్తిదారుల్లోకల్లా పెద్ద అయిన వాడు ప్రపంచంలోని బ్యాంకర్లలో కల్లా పెద్ద అయినవాడిచేత పోషింపబడదలచ లేదు. ఉక్కు డబ్బుకంటే గొప్పది. కొండే మహమ్మదు దగ్గరికి రావాలి.

"సరే! నేనే వస్తా"నని మోర్గస్ గుర్రుమన్నాడు.

అతడు బండిని పిల్చి కార్నెగీ ఇంటికి వెళ్ళాడు. పదిహేను నిమిషాలలో పర్వతమంత లావా దేవీకి ఒప్పందం కుదిరింది. వాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడే కార్నెగీ చిన్న కాగితపు ముక్కమీద 40,00,00,000 [నలబై కోట్లు] డాలర్లు అని అంకెవేసి మోర్గస్ చేతికిచ్చాడు. ఇది అతని భాగపు ధర.