పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/186

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కొంత సెలవు తీసుకొని ఎక్కడికైనా దూరంగా కొన్నాళ్లు ఎందుకు వెళ్ళగూడదు?" అన్నాడతడు.

"పన్ను వసూలుచేసే పడవమీద కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్లుదా మనుకుంటున్నాను. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రాడ్లీ కొద్దిరోజులకు పూర్వమే మరణించాడని నీకు తెలుసుననుకుంటాను. న్యాయవృత్తిని అనుసరించే వాళ్ళల్లో అతనికి 'అనుగామి'గా ఉండదగ్గవాడు ఎవడా అని నిశ్చయించడం కోసం ఆలోచిస్తున్నాను" అన్నాడు అధ్యక్షుడు హారిసన్ సమాథానంగా.

"ఆస్థానానికి తగిన యోగ్యతగలవాడు పిట్స్‌బర్గ్‌లో ఒకడున్నాడు. అతడూ నేను పూర్వం చేపలు పట్టటంలో సహచరులం. అందువల్ల అతనిమీద నేను అనుచితమైన పక్షపాతాన్ని వహిస్తున్నానని మిత్రులయిన మీరు అనుకోకుండా వుంటే ఈ ఉద్యోగానికి అతణ్ని నేను సూచిస్తున్నాను. అయితే అతడు నాకు అతిసన్నిహితుడైన మిత్రుడు కావటంవల్ల అతణ్ణిగురించి నేను సక్రమమైన పరిశీలనచేసి ఉండకపోవచ్చు. అతడు బాగా చదువుకున్న వాడు, సత్య నిరతుడైన న్యాయవేత్త అని మాత్రం ఎరుగుదును," అన్నాడు కార్నెగీ.

"అతని పేరు?"

"జార్జి షిరాన్"

అధ్యక్షుడు తల పంకించాడు. "నీ సలహా తీసుకొని అతణ్ణి పరిశీలిస్తాను" అన్నాడు.