పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరునాటి ఉదయం రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి బ్లెయిన్ ఆఫీసుకు వెళ్ళి కార్నెగీ అతణ్ణి పిలిచాడు. అతడు సంతోషంతో అతణ్ని ఆహ్వానించాడు.

"గడచిన రాత్రి నీవు యిక్కడ వున్నట్లు మాకు తెలియ జేయ లేదేం?" అని అడిగా డతడు. "అధ్యక్షుడు మిసెస్ బ్లెయిన్‌తో నీవు నగరంలో వున్నావని చెప్పినప్పుడు ఆమె ఎంతో చింతపడ్డది. మిష్టర్ కార్నెగీ నీవు ఎప్పు డీ నగరానికి వచ్చినా, మా గృహంలో నీకు ఒక ఖాళీ స్థానమున్నదని భావించు."

"రాత్రి మీ ఇంటి విందును పొంద లేక పోయినందుకు ఎంతో చింతిస్తున్నాను" అన్నాడు కార్నెగీ. "కానీ నిన్ను నిన్నటిరాత్రి కలుసుకోకపోవటం ఒక విధంగా నా అదృష్టం. ఇప్పుడు చూడటంవల్ల నేను అధ్యక్షుడు హారిసన్ తో చేసిన చర్చను గురించి విడిగా నీకు చెప్పడానికి అవకాశం కలిగింది"

"అవును అది అదృష్టమే" అని కార్యదర్శి అంగీకరించాడు.

"అప్పుడు మనం కలిసి వున్నట్లయితే అధ్యక్షుడు ముందుగానే మనం కలసి కూడబలుక్కున్నామని అనుకునే అవకాశముండేది."

అలా వాళ్లు పిచ్చాపాటిగా మాట్లాడుకునే సమయంలో పశ్చిమ వర్జీనియా సెనేటర్ ఎల్కిన్స్ లోపలికి వచ్చాడు.