పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"బహుశ: ఇది నీ విషయంలో సత్యమయి వుండవచ్చు" అని అధ్యక్షుడు హారిసన్ అంగీకరించాడు.

"కానీ పోరాడుటమంటూ వస్తే నేను సరివుజ్జీనిచూచు కుంటాను"

"చిన్నదిగదా అనీ నిన్ను యేదేశమయిన అవమానిస్తే ఊరుకుంటావా?"

"నన్ను నే నవమానించుకోవలసిందే గాని ఇతరులు ఎవరూ నన్ను అవమానించ లేరు. గౌరవానికి సంబంధించిన గాయాలను ఎవరికి వారే చేసుకుంటుంటారు"

"మన నావికుల నిద్దరిని తీరంమీద ఎదుర్కొని వాళ్లు చంపివేశారు. అయితే నీ వీ చర్యను సహించగల వన్నమాట"

"మిస్టర్ ప్రసిడెంట్ త్రాగుబోతులయిన నావికుల మధ్య జరిగిన చిన్న కలహంవల్ల యునైటెడ్ స్టేట్స్ అవమానితమయిందని నేను అనుకోను. ప్రజాశాంతి భంగమయి నగరంలో కొట్లాటలు జరుగుతున్నప్పుడు నావికులను తీరం మీదికి దిగి తిరగనిచ్చినందుకు నేనయితే ఆ నావ కెప్తానును కాల్చేయిస్తాను"

వైట్ హౌస్ ద్వారందగ్గిర వాళ్ళిద్దరూ విడివిడి పోయే వేళకు చీకటి పడ్డది. "ఇవాళ రాత్రికి నే నో విందుకు వెళ్లుతున్నాను. రేపు సాయంత్రంవచ్చి నాతో భోజనం చెయ్యి. అప్పుడు నా కుటుంబం తప్ప ఇంట్లో ఎవ్వరూ వుండరు. మనం విపులంగా మాటాడుకోవచ్చు" అన్నాడు అధ్యక్షుడు.