పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషయ" మన్నాడు. ఇది జీవితాంతంవరకూ నిలుపుకోలేక పోయిన ప్రకటన అని అతడు గుర్తించాడు. 1889 లో అతడు నార్తు అమెరికన్ రివ్యూలో రెండు వ్యాసాలు వ్రాశాడు. వీటిలోని సారాంశమే చివరకు అతని "ఐశ్వర్య సూత్రం" (Gospel of Wealth) అన్న పేరుతో ప్రసిద్ధి కెక్కింది. అతడు ధనాన్ని బంధువులకు తన తదనంతరం వారసత్వంగా చెందేటట్లు ఇచ్చి వెయ్యవచ్చు. తన మరణానంతరం ప్రజా సంక్షేమ కార్యాలకు దానిని వినియోగించుటంకోసం విడిచిపెట్టవచ్చు. లేదా దాన్ని తన జీవితకాలంలోనే ఇచ్చి వేయవచ్చు. ఈ మూడింటిలో కార్నెగీ చివర మార్గాన్ని మిగిలిన రెంటి కంటె మంచిదిగా భావించాడు. ధనాన్ని ప్రజావారసత్వంగా విడిచిపెట్టి వెడితే దాతకుగల వాస్తవమైన ఆదర్శంగానీ, లేదా ఆకాంక్షగాని కొన్ని సందర్భాలలో సఫలం కాకపోవచ్చు, ఏమయినా అత డిలా అన్నాడు. "లోకానికి ఎక్కువ ప్రయోజనకారి కాకపూర్వమే అతడు మరణించేటంతవరకూ ఆగి వుండటానికి తృప్తివహించగలిగితే ఆస్తిని మరొకరి పరం చేయడానికి ఇది ఒక సాధన మాత్రమే ఔతుంది." ఇటువంటి ఆచారాలను నిరుత్సాహపరచటం కోసం వారసత్వాల మీద విశేషంగా పన్నులు విధించాలనీ అతడు అభిప్రాయ పడ్డాడు. "తనవెంట తీసుకుపోలేని దానిని విడిచి పోయినందుకు ఒక వ్యక్తిని స్తుతించటం అసాధనం, వ్యక్తి మరణవేళ ఎంత విడిచిపెట్టి వెళ్ళినా అది పరిగణీయమయింది కాదు. అట్టి ధనం అతడి దగ్గరనుంచి బలవంతంగా