పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఒక మధ్యాహ్నంవేళ జరిగిన సంఘటనను గురించి చెపుతూ స్క్వాబ్ తరువాతి కాలంలో ఎంతో సంతోషింస్తుండేవాడు. స్క్వాబ్ తానే న్యూయార్క్ చేరిన తరువాత ఒక వ్యాపార విషయాన్ని గురించి కార్నెగీ సలహాను పొందటం కోసం అతని యింటికి వెళ్లాడు. అలా వెళ్ళినది యింకా స్వయంచోదకాలయిన బండ్లు ఏవీ లేని రోజులు. అతడు తనకు సహజమైన రీతికి తగినట్లుగా అందమయిన "కాబ్"ను గాని, లేదా ఒంటి గుర్రపు బండిని గాని పిలవకుండా ఒక "కారేజి"ని పిలిచాడు. యజమానితో మాట్లాడటానికి యింట్లోకి వెడుతూ శకట చోదకుడితో వేచివుండవలసిందని చెప్పాడు. వాళ్ళ సమావేశం అనుకున్న దానికంటె ఎక్కువసేపు పట్టింది. చివరకు అతణ్ని తనతో భోజనానికి వుండిపొమ్మని కార్నెగీ ఆహ్వానించాడు. బండిని గురించి పూర్తిగా మరచిపోయి చార్లీ ఆహ్వానాన్ని అంగీకరించాడు. భోజనానంతరం తన సంభాషణను యింకా పొడిగించాడు. చివరకు బట్లరు వచ్చి ద్వారం దగ్గర నిలచి అన్నాడు.

"క్షమించండి మిస్టర్ స్క్వాబ్ బండిని మీరు యింకా వుండమంటారా?" చార్లీముఖం బీటు దుంపలా ఎర్రవారిపోయింది. తిరిగి స్వస్తాయిని పొందేలోగా అతడు కలవరపాటును పొంది మాటల్లో నోటితుంపరలు రాల్చాడు. అతని పూర్వ యజమాని ఒక మాటయినా అనలేదు. ఊరక కూర్చుని హఠాత్తుగా తోచిన హాస్యాస్పదమయిన అభినయంతో అతనివైపుచూశాడు. మాటలతో పనిలేకపోయింది.