పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిల్లును నిర్మించటం జరిగింది. ఒకనాడు యజమాని దానిని చూడవచ్చాడు. ఎప్పటిలాగానే తేజస్సుతో, పొంగిపొరలే ఆత్మవిశ్వాసంతో మోయవలసివున్న మహాకార్య భారాన్ని వహించే ఉత్సాహంతో స్క్వాబ్ తనకు కనిపిస్తాడని అతడు ఆశించాడు. కానీ, కార్నెగీ అన్నిటినీ పరిశీలిస్తూ నడుస్తున్నప్పుడు అతడి కుశాగ్రమయిన బుద్ధి స్క్వాబ్ ఉయ్సహంతో లేడని గమనించింది. చార్లీ అక్కడ కేవలం ఉద్యోగానికి వున్న ప్రదర్శకుడు (Guide) లా వున్నాడు. ఏదో నిత్యం గడచిపోతున్న పనిలాగానే ఈడ్పుగొట్టు ధోరణిలో అతడికి విషయాలను తెలియ జేస్తున్నాడు.

చివరకు ఆ ప్రముఖు డన్నాడు: "చార్లీ, ఇక్కడ ఏదో లోపం కనిపిస్తున్నది. నీ కేదో ఆశాభంగం కలిగినట్లు నాకు తోస్తున్నది. ఈ కర్మాగారంలో ఏదో దోష మేర్పడ్డది. అటువంటిదేమీ లేదా?"

"లేదు కార్నెగీ!" అని సమాధానమిచ్చాడు స్క్వాబ్.

"ఇది ఎలా వుంటుందని నేను చెప్పానో అలాగే వచ్చింది. నేను చెప్పినట్లు మనం ఖరీదులు తగ్గించుకున్నాము అయితే, దీన్ని నేను మళ్లా నిర్మించమంటూ వస్తే కొద్దికాలానికి పూర్వమే క్రొత్తగా కనిపెట్టబడ్డ మరొకదాన్ని ప్రవేశపెడతాను. అందుమూలంగా మనం టన్నుకు పది సెంట్లు కాదు, డాలరు పొదుపు చేసుకోవచ్చును" అన్నాడు.

"అయితే నీ అభిప్రాయ మేమిటి? ఈ మిల్లును నీవు మార్చగలవా?"