పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విలియం కార్నెగీ 1834 లో మేరీ మారిసన్‌ను వివాహమాడాడు. అప్పటికే ఇతడు నేతపనివాడుగా పేరుపడ్డాడు. అంతస్తున్నర వున్న రాతికుటీరంలో వీరిద్దరికీ 1835 నవంబ్రు 25 న పెద్దకుమారుడు కలిగాడు. ఉత్సాహవంతుడైన ఆతని తాత గౌరవార్థం అతనికి 'ఆండ్రూ' అని వారు నామకరణం చేశారు. విలియం మగ్గం క్రింది అంతస్తులో వొక గదిని ఆక్రమించుకొని వుండేది. దానికి ప్రక్కగాఉన్న గదిలోను, ఇంటికి కొసన వున్న చిన్న గదిలోను వాళ్లు నివసిస్తూండేవాళ్లు. విలియం ఎప్పుడూ ఏవేవో కలలు కంటుంటాడు; అయినా మంచివాడు. నీతిమంతుడు. వొకసంవత్సరం అటూ ఇటూగా ఇతడు తన వ్యాపారాన్ని బాగా పెంపొందించాడు. వాళ్ళు పెద్దయింట్లోకి మారారు. అదనంగా మరి మూడు మగ్గాలు కొన్నారు. వాటిమీద పనిచేయటానికి మనుష్యులను పెట్టుకున్నారు. క్రింది అంతస్తంతా నేతగదులు. వారి నివాసం పై అంతస్తులో.

తరువాత చాలాకాలానికి ఆండ్రూ మహాధనవంతుడైనపుడు వంశ వృక్షాలను వ్రాయటం వృత్తిగా పెట్టుకొన్న వొకవ్యక్తి వచ్చి అతని వంశవృక్షాన్ని తయారుచేసే పని ఇవ్వవలసిందని కోరాడు. వాళ్ళను స్కాచ్ రాజకుటుంబపు సంతతివాళ్ళని అందులో నిరూపిస్తానని సూచన చేశాడు.

"ఇది వినటానికి నా కెంతో చింతగా వుంది" అని. ఈ మాటలు నచ్చని కోటీశ్వరుడు "నేను వొక నేతపనివాడి కుమారుడ నన్న భావంతోనే నా భార్య నన్ను వివాహం చేసుకున్నది" అంటూ ప్రతి సమాధాన మిచ్చాడు.