పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆరంభించటమంటే ఏమిటో అర్ధంచేసుకోటానికి ఆండ్రూ ఇంకా చాలా చిన్నవాడు.

"మీరుకూడా మాతో రావలెనని నా కోరిక!" అని ఆంట్ అన్నా ఐట్కిన్ నిట్టూర్చింది.

"వద్దు, వద్దులే అన్నా" అని ఆండ్రూ తండ్రి నిష్కర్షగా తలత్రిప్పాడు. "ఇప్పుడే ఈ క్రొత్త అద్దె యింట్లోకి మారాము. నావి నాలుగు మగ్గాలు నడుస్తున్నవి. ఇప్పుడు కాదు" అన్నాడు.

విలియం కార్నెగీ నారతో బుటేదారు పనితనాన్ని చూపించే బల్లగుడ్డలను, చేతిరుమాళ్ళను తయారుచేసే నేత పనివాడు తమ ఇంటిలోనే నేత నేసి జీవించే స్కాట్లండులోని వేలకొలది నేతపని వాళ్ళలో ఇత డొకడు.

ఆండ్రూ జన్మించిన డన్ఫ్‌ర్మ్‌లైన్ స్కాట్లండులోని బుటేదారు పని కంతటికీ కేంద్రంగా వుంటుండేది. అచటి వాళ్ళలో ఎక్కువమంది నేతపనివాళ్ళు. మంచి అభివృద్ధిలో వున్నప్పుడు ఆ నగరంలోని కుటీరాల్లోను, పరిసర గ్రామాల్లోను నాలుగు వేలకు పైగా వున్న మగ్గాల చప్పుళ్లు వినిపిస్తుండేవి. నేతపని వాడు కావలసిన వస్తువులకోసం, లేదా నమూనాలకోసం పని ఇచ్చేవాడిదగ్గిరికో, గుత్తవ్యాపారి దగ్గిరికో వెళ్ళి అవి తీసుకొని ఇంటికి తిరిగివచ్చి, ఆ తాను నేసి తిరిగి పని ఇచ్చినవాడి దగ్గరకు వెళ్ళి దాన్ని వొప్పచెప్పి, రావలసిన డబ్బు పుచ్చుకొని మరొక ఆర్డరు తెచ్చుకుంటాడు.