పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పొట్టచీల్చి బిడ్డను తీయుట.

(మ.రా.రా.శ్రీ. ఆచంట లక్ష్మీపతి, బి. ఏ. ఎమ్‌. బి. సీ. యమ్‌. గారిచే వ్రాయబడినది.)

పైశీర్షికను చదువునప్పుడు అందుండు చీల్చు అను పదమును చూచినతోడనే మీకు ఒక విధమయిన భయమును, సంశయమును కలుగువచ్చును.

ఏలయన పొట్టచీల్చిన తరువాత తల్లి బ్రతుకునా! ఏమి ఈ సాహసపు పని అని భయమును, పొట్టలోపల జీవించియుండెనో లేదో, భూమిమీద పడిన తర్వాత ననేక గండములు గడచి జీవించునో లేదో యను సంశయాస్పదమయిన కూనకొఱకై తల్లిపొట్టను చీల్చుట తగునా! అని సంశయమును కలుగవచ్చును.

ఈక్రింద వ్రాయబోవు వ్యాసమును చదువువారికి అట్టి భయమును సంశయమును తీఱునని తలంచుచున్నాను. తగిన శస్త్రవైద్యుని చేతులతో పొట్ట చీల్చుటా యనగా గజ్జికురుపును చిదుపుటకంటె సులభము. ఏలయనగా మనము గజ్జికురుపును చిదిపినప్పుడు కొంచెమయిన నొప్పియుండకపోదు. శస్త్రవైద్యులు పొట్టను చీల్చునప్పుడు లేశమును నొప్పియుండదు.

పాశ్చాత్య వైద్యశాలలయందేమి, ఇప్పుడు మన చెన్నపట్టణమునందేమి, లెక్క లేకుండ నిట్టి శస్త్రక్రియలు (ఆపరేషనులు) ప్రతివారమును జరుపబడి అనేకుల తల్లులును బిడ్డలును పునర్జన్మము నొందింపబడుచుండుటచే పొట్టజీల్చుటాయన్నంతమాత్రమున భయపడు మాచదువరులకు ఈవైద్యవృత్తాంతమును కొంతవఱకు తెలుపవలసియున్నది. పల్లెలనక పట్టణములనక ప్రతియూరియందును శిశువులు ఎందరెందఱో పుట్టుచున్నారు. వేయింటికి 970 మంది తల్లులు వైద్యసహాయము లేకయె పురుడుపోసికొందురు. కాని ఈ క్రింద వివరింపబోవు సృష్టివైపరీత్యములచే కొందఱును, తెచ్చిపెట్టుకొన్న సుఖవ్యాధులు మొదలగువాని కారణములచే కొందఱును తమంతటతాము సుఖప్రసవము కాజాలకున్నారు.

సృష్టివైపరీత్యములు ఎట్లుకలుగునని తెలిసికొనవలెననిన జననావయవములయొక్క శాస్త్రజ్ఞానము కొంతవఱకు కావలసియున్నది.