పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204 ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక.


క్కవిహరిహరప్రణీత మగురతిశాస్త్రమును మూఁడా శ్వాసములుగా రచించెను.

(14) పామనృపాలుడు (1700)

ఇతఁడు నైజామురాజ్యమున నుండుసురపురసంస్థానమునకుఁ బ్రభువు. కాణాదము పెద్దనసోమయాజి శైషశైలేశలీల యనుపంచవర్గీయకృతియు మత్స్యపురాణమును ఇతని కంకిత మొసఁగెను. ఇక్కవి భార్గవ పురాణ మతిలలితముగాఁ దెనిఁగించెను.

(15) చిజ్జుళ-తిమ్మభూపాలుడు. (1700 A.D.)

ఇతఁడు కృష్ణాతీరమున నుండుప్రాకుటూరీపురవరుండు; వేమారెడ్డివంశజుఁడు. ఇతఁడు మురారిప్రణీతమగు ననర్ఘ రాఘవనాటకమును జంపూకావ్యముగాఁ దెనిఁగించెను. అయ్యది చాలఁబ్రౌఢమై నిరుపమానమై యున్నది. దీనినే నేఁటికాలమునఁ గొందఱు తెనిఁగించిరి కాని తిమ్మభూపాలునికృతి కీడు రాదు. చూడుఁడు కవిప్రౌఢిమ : _

               శా. జాతాపక్వపలాండుపాండిమ ధరచ్ఛాయంగనెన్ దారలు
                    ద్భూతింగైకొనెఁబ్రాచి కొన్ని కిరణంబుల్ పద్మజీవాతువుల్
                    లూతాతంతువితానవర్తులనభోలోలాత్మ బింబంబుతోఁ
                    బ్రాత:ప్రోషితరోచియై డిగియెఁ దారానాథుఁ డస్తాద్రికిన్
                                      _______
               సీ. లోకత్రయీచారు ♦ లోచనోత్పలపాళి,
                             కసమపీయూషధా ♦ రాగ్రయణము
                   నధ్వనీనోన్మాది ♦ హవ్యవాహోచ్చల,
                             దాలాతనిబిడలే ♦ ఖాపలంబు
                   ప్రకటతమ: పుంజ ♦ ముకుళితవిష్టపో,
                             ద్ఘాటనపాటవో ♦ దగ్రకుంచి
                   జగము లొక్కట గెల్వఁ ♦ జాలు వీరులలోనఁ,
                             గమలసాయకు నాద్య ♦ గణితరేఖ

              తే. సతతవికసనజాగ్రన్మ ♦ సారకచభ
                  రాముఖాంబుజశ్రీపతి ♦ రాజబీజ
                  మనుపమానందకల్పద్రు ♦ మాంకురంబు
                  నిదుఖండంబు గనుఁగొంటి ♦ యిందువదన.
                                   _________

(16) కోట-రాయరఘునాధుడు (1720 A.D.).

ఇతఁడు దక్షిణదేశమునఁ బుదుకోటసంస్థానాధీశుఁడు. తొండమాన్ చక్రవర్తివంశజుఁడు. ఇతని సభలోనుదుపాటి వేంకనకవిప్రఖ్యాతుఁడై యాంధ్రభాషార్ణవ మనునిఘంటువు రచించెను. రఘునాథుఁడు పార్వతీపరిణయము, కవిజనసంజీవనము అను రెండుకృతుల రచించెను. పార్వతీపరిణయమువ్యాకరణదోషముల కెల్లనిలయమనుట యొక్కటేయక్కవికి న్యూనతగాని మహాకవుల కావ్యగుణములన్నియు దీనఁ గలవు. అద్భుతభావకల్పనలకుఁగాని హాస్యరచనాకౌశలమునందుఁ గాని కృష్ణరాయలకాలమునకుఁ దరువాత నిట్టికవులు పెక్కురు లేరు. భావములు నూతనములై యుండుట తంజాపుర పుదుకోట మధురాపుర రాజకవుల కే చెల్లును. హాస్యరసచాతుర్యము, వ్యాజోక్తులును వీరికృతులలో స్వతంత్రముగా నెఱయుచున్నవి. ఇది ముద్రిత కావ్యము గావున నుదాహరణము లనావశ్యకము.

స్థలసంకోచముచే ననేకాంశములు ద్యజింపఁబడినవి. స్థలాంతరమున విరివిగా వ్రాయఁ దలఁచినారము. దామరవేంకటపతి, ఎల్లవిభుఁడు, ముద్దళిగిరి, ఎఱ్ఱభూపతి, విజయరాఘవుఁడు, విజయరఘునాధుఁడు, నంజరాజు, దొడ్డరాజు మొదలగు రాజకవు లనేకు లున్నారు.ఆంధ్రభాషాభివర్థనీసంఘమువారిపుస్తకములు బహుచవుక వెలకుదొరకును. మేనేజరు, ఆంధ్రభాషాభివర్థనీసంఘము, అని వ్రాయవలయును.