పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక

197

ఆంధ్ర రాజకవులు.

(మ. రా. శ్రీ. మానవల్లి రామకృష్ణయ్య. ఎం. ఏ. గారిచే వ్రాయబడినది.)

లక్ష్మీసన్నిధానముననే సరస్వతీమహిమ ప్రకాశించుచున్నది గాని యేకపదావాసమును జెంది లక్ష్మీసరస్వతులు నిర్మాత్సర్యమున నుండుట మిక్కిలి యరుదు. బహుకార్యధురంధరులును భోగైకపరాయణులును వీరలక్ష్మీసంభావితులు నగురాజేంద్రులకు గాలాంతరఫలదాయకమై సద్యశ్శ్రమరూపమై గురుకులక్లేశమాత్రఫలంబగు విద్యాన్యసనము హృదయంగమము గాక సప్తవ్యసనములకంటెను హేయమగుచుండును. అయినను గవులకృతిపటములు లేక ప్రతాపాఢ్యులగు నరేంద్రులచరిత్ర చిత్రములు స్వప్నమునందును బుట్టనివి యగును. కావుననే స్వతస్తేజగముల నక్షత్రములవంటి కవిబ్రహ్మలఁ జేరఁదీసి రాజచంద్రులు తమయౌదార్య తేజముల విలసిల్లఁ జేయుదురు. అనుక్షణవిభాస్వరములగు ప్రజ్ఞా రత్నములనడుమ నాయకమణియు శోభాయమాన మగుట యాశ్చర్యముకాదు. రత్నసాన్నిధ్యమును గన్నస్ఫటికమును వెలుగుచుండును. భ్రమరముల నడుమఁ జిక్కినకీటకము భ్రమర మగుచుండలేదా? అదియునుంగాక వివిధరసాస్వాదనలుబ్ధులగు భూవరులకుఁ గావ్యరసము లేక తనివి గలుగదు. కావ్యామృతము తక్కిన రసములలోని నీరసత్వమును జూపి కృతిముఖమున రాజులకీర్తిశరీరముల నజరామరములుగఁ జేయును. కవిరత్నముల కాశ్రయణీయులగు ప్రభువులు నికషోపలములవంటివారు గాకున్న మహామతు లట్టివారిసభాభవనములు ద్రొక్కంజనరు. సంస్కృతమున రాజకవు లనేకులు గలరు. విక్రమాదిత్యుఁడును బ్రవరసేనుండును హర్షుఁడును సింధురాజును గర్ణుఁడును గులశేఖరపాండ్యుఁడును శాతవాహనుఁడును వాక్పతిరాజును జాలఁబ్రఖ్యాతులు. కావుననే వీరియాస్థానములఁ గాళిదాసబిల్హణగుణాఢ్యాదులు కీర్తిరూపములగు జ్యోతిర్మయశరీరములతో విహరించిరి.

ఆంధ్రభాషలో రాజకవులు పెక్కుఱు గలరు. వీరిలోఁ గొందఱు చక్రవర్తిపదమును మహారాజ పదవిని జెందినవారు. మఱికొందఱు రాజబంధువులై కావ్యరసమునే*గ్రోలుచు విద్యావిలాసమున నెగడ్త కెక్కిరి. ఇట్టిరాజకవులను గుఱించియు వారి కావ్యములగూర్చియు స్థూలరూపమున నిందుఁ జెప్పఁబడును.

వీరిలోఁ జరిత్రాంశముల శోధించి చూచినంతలోఁ బ్రాథమికుడు నన్నెచోడదేవుఁడు. ఇతఁడు కావేరీతీరమున నొరయూ రనుపురమురాజధానిగాఁ జోళమండలము నేలినవాఁడు. ఇతనికి దిగ్విజయమునుబట్టి టెంకణాదిత్యుఁ డనియుఁ గవిత్వకౌశలమువలనఁ గవిరాజశిఖామణి యనియు బిరుదములు గలిగెను. ఇతఁడు క్రీ. శ. 940 సంవత్సరమునఁ బాశ్చాత్యచాళుక్యులతో నెదిర్చి రణరంగమున నిహతుఁడయ్యెను.

             "క. పురుషుఁడు పురుషున కని న
                  స్థిరజీవితలోభ యుతమతిని వినమితుఁడై
                  స్మరకలహకుపితఁ బ్రాణే
                  శ్వరి నాయుధసమితిఁ దెలచువాఁ డటుమీఁదన్.
               ఉ మంచిగఁ బ్రీతిఁబాఁయక సమస్తజనంబులుఁదన్నుఁగొల్వఁజీ
                  వించినధన్యుఁ డామహిమవీడినజీవము మేన నిల్ప నా

ఆంధ్రపత్రిక : _ లో త్వరగా చదువుటకు కావలసిన వార్తలు, నెమ్మదిమీదచదివి ఆలోచించి మేలుపొందదగిన వ్యాసములు ఉండును. గబగబపరుగెత్తు వ్యాపారికి ఇంటిలో నెమ్మదిగా చదువుకొను విద్యార్థికితగిన వార్తలు, వ్యాసములు, ఉండును.