పుట:Aandhrakavula-charitramu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనశ్రుతిలోని కధలతో గాథలతో నిండి ఉంది, అయినా గురజాడ శ్రీరామమూర్తిగారి కవి జీవితాలు శ్రీవీరేశలింగంగారి కవులచరిత్ర రచనకు ప్రేరకమని చెప్పవచ్చు.

శ్రీ కందుకూరి వారు తమ కవులచరిత్రలో కవులకాలనిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. కవుల కావ్యాల గుణదోషాలను కూలంకషంగా కాకపోయినా దిఙ్మాత్రంగా నయినా సమీక్షించారు వారు నిర్ణయించిన కొందరి కవుల కాలనిర్ణయాలను ఆధునికులంగీకరింపక విమర్శించారు. ఆ విమర్శనల్ని పరికించిన శ్రీ వీరేశలింగంగారు అలా జరగడానికి హేతువుల్ని తమ కవుల చరిత్ర పీఠికలోను తమ జీవితచరిత్రలోను ఉల్లేఖించు కొన్నారు. ప్రధమ ప్రయత్నంలో ప్రమాదాలు దొరలడం వింతకాదు. విమర్శనీయం కాదు.

ఆనాటికి-అనగా శ్రీవీరేశలింగంగారు కవులచరిత్ర వాసేనాటికికన్నా నేడు అనేక శిలాశాసనాలు, తామ్రశాసనాలు బాహిరిల్లినవి. అనేక తాళపత్ర గ్రంధాలు వెలుగులోనికి వచ్చాయి. కొంగ్రొత్త రీతులలో విశిష్ట పరిశోధనల దారులు తీశాయి. స్థిరంగా కవుల కాలనిర్ణయాలు, చేయడానికి వలను పడుతున్నది. అయినా యింకా కొందరి కవుల కాలనిర్ణయాలు ఊహగానాలే. ఆనాటికవులు తమకావ్యాల్ని నృపాలాంకితంచేస్తూ వారి సాహసౌదార్యాంకాలను వారివంశానుక్రమణికలను తమరచనల్ని తమవంశాల్ని ఉటంకించుకొన్నారే కాని తమ జీవితచరిత్రాంశాలను లవలేశమైనా ఉల్లేఖించుకొన్నారుకాదు. ఆకారణంగా వారి అభిరుచులు, అలవాట్లు, దినచర్య జీవితంలోని రసవత్తర ఘట్టాలు, ఆన్నీ విస్మృతి కుహరంలోనే వుండిపోయినాయి, అది ఆంధ్రుల దురదృష్టం. ఈనాటి వారివలె ఆ నాటి కవీశానులు స్వీయచరిత్ర ప్రస్తావనా ప్రలోభలోలుపులుగారేమో.

శ్రీ వీరేశలింగంగారి మరణానంతరం వారి ఆంధ్రకవులచరిత్ర సమగ్రంగా సంస్కరింపబడకుండగానే 1937 వ సంవత్సరంలో యధాతధంగా ముద్రణ పొందింది. తదుపరి 1940 వ సంవత్సరంలో ఆంధ్రకవులచరిత్ర ద్వితీయ భాగాన్ని 1950వ సంవత్సరంలో తృతీయ భాగాన్ని హితకారిణీ సమాజం అచ్చొత్తించింది.