Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1]

51

నన్నయభట్టు

దీనినిబట్టి చూడఁగా నాంధ్రభాషాభూషణాదులను, అథర్వరణ కారికావళిని సహాయ పఱుచుకొని బాలసరస్వతియే యాంధ్రశబ్ద చింతామణిని జేసి దానికి గౌరవము కలుగుటకయి నన్నయభట్టారకుని పేరుపెట్టినట్లు నిశ్చయింప పలసియున్నది. అప్పకవి యాంధ్రశబ్దచింతామణి వ్యాఖ్యానము నారంభించినది శాలివాహన శకవర్షములు 1538 మన్మధ సంవత్సర మనఁగా హూణశకము 1656 వ సంవత్సరము బాలసరస్వతికిఁ బుస్తకము దొరకిన దన్న కీలకసంవత్సరము హూణశకము 1605 వ సంవత్సర మగున. ఆంధ్రశబ్ద చింతామణి నన్నయభట్ట ప్రణీతము కాదనుట కా పుస్తకములోనే నిదర్శనములున్నవి. అప్పకవికాలమునం దా పుస్తకములో 'నుమ్చోతో హల్య ధర్వణాచార్యమతాత్' అను సూత్రముండుట చేతను, దాని నప్పకవి

గీ. సమసనమున నామాంతశృంగముల కెల్ల
    హల్లు గదియ స్వార్థంబున బొల్లుద్రుతము
    వికృతి నాగమమై ద్రుత ప్రకృతిపగిది
    గాంచు సంధి నధర్వణకవి మతమున.

అని తెనిఁగించుటచేతను నన్నయభట్టారకుని తరువాతి కాలపు వాఁడైన యధర్వణాచార్యునిపే రాంధ్రశబ్ద చింతామణియం దుండుట యొక్కటియే యది నన్నయభట్ట విరచితము కాదని స్థాపించుచున్నది. ఈ బాధకమును తొలగించుటకై తరువాతివారు పయి సూత్రములోని "యధర్వణా చార్యమతా" త్తను భాగమును దీసివేసినారు. భారతమును జదివిన బాలురకు సహితము తెలుఁగున పదాదియందు యకారము లేదని నన్నయభట్టమత మగుట కరతలామలక మగును. అట్లయ్యు నాంధ్రశబ్ద చింతామణి యందు "ఆద్యః క్రియాసు భూతార్ధ ద్యోతిన మాద్యగం వినా సర్వః" అను సూత్రములోఁ బదాది యకారమున్నట్లు చెప్పఁబడినది.

"సర్వత్రాణ్వ త్కార్యం జ్ఞేయం యస్య ద్రుతపకృతి కేభ్యః"

అని యీ ఆంధ్రశబ్ద చింతామణి సూత్రము దృత ప్రకృతికముల కంటె బరమయిన య కారమున కంతట నచ్చువలెఁ గార్యమగునని చెప్పచున్నది.