కేతనమంత్రి
ఇతడు బాణభట్టకృతమైన కాదంబరి కావ్యమును తెనుఁగున రచియించెను. కేతనకృత మయిన కాదంబరిలోని దని రంగరాడ్చందమునందీ పద్యముదాహరింపఁబడి యున్నది
ఆ.వే. జనవరేణ్యుఁ గాంచి సాష్టాంగ మెరఁగిన
నా విభుండు వాని లేవనెత్తి
కౌగిలించి వానిఁ గనుఁగొని కేయూర
కాభిధాన మొసఁగెఁ గడుముదమున.
ఈకేతనకవి దశకుమార చరిత్రమును రచియించిన కేతనకవి కాఁ డనియు, భాస్కరుని కేతన యనియు, కొట్టరువు కేతన యనియు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారును శ్రీ మానేపల్లి రామకృష్ణ కవిగారును వ్రాయుచున్నారు. ఈ పుస్తకము నాకు లభింపలేదు. ఇదియే నిజమయిన పక్షమున కేతనకవి తిక్కన సోమయాజికిఁ బెదతండ్రి యయి యుండవలెను. అప్పు డతని కాలము 1240-50 ప్రాంతములగును. కేతన ప్రెగడ విరచితమైన కాదంబరిలోని దని యుదాహరణ గ్రంథములో నీ క్రిందిపద్య ముదాహరింపబడినది.[1]
సీ. దీనిలోపలఁ గొన్నిదినము లుండిన నుష్ణ
కరుఁడై న నట శీతకరుఁడు గాఁడె
దీని పెంపెఱిఁగినఁ దా నంబురాశిలోఁ
గాదని జలశాయి కావు రాఁడె
దీని తియ్యని నీరు దివిజులు త్రాగి చూ
చినఁ దమయమృతంబు చేఁదు గాదె
దీనితోయము తలపై నల్కినంతనె
పాపాత్ములును మోక్షపరులు గారె
- ↑ పెదపాటి జగ్గన కూర్చిన 'ప్రబంధరత్నాకరము'న నిది యుదాహృతము.