46
ఆంధ్ర కవుల చరిత్రము
పద్యమువలనఁ దెలియవచ్చుచున్నది. భీమన నశింపఁజేయుటచేతఁ గాకపోయినను మఱియే హేతువుచేతనో నన్నయభట్టకృత మైన ఛందస్సిప్పుడెక్కడను కానబడదు నన్నయభట్ట విరచితమైన లక్షణసార మిప్పడున్నదనియు, దానిలో నితరలాక్షణికు లుదాహరించిన పద్యము లన్నియు నున్న వనియు తిక్కనకృతమైన కవివాగ్బంధనమునందువలెనే దీనియందును విశేషవిషయము లేవియు లేవనియు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులవారు వ్రాయుచున్నారు. లక్షణసారమును, ఇంద్ర విజయమును, నన్నయభట్ట విరచితములుగాక యన్నయభట్ట విరచితములని మఱియొక మిత్రులు నా పేర వ్రాయుచున్నారు వేఱొకరు నన్నయభట్టు రాఘవాభ్యుదయములోని దని యొక పద్యము నుదాహరించి యున్నారు. ఆంధ్రశబ్దచింతామణికి ప్రక్రియాకౌముది యని మఱియొక పేరు కలదు. దీనిని రచించుట చేతనే నన్నయ భట్టునకు వాగనుశాసనుఁ డను బిరుదు పేరు కలిగినదందురు, గాని, యీ యంశము విశ్వసనీయము కాదు. ఈ తెలుఁగు వ్యాకరణము సంస్కృతభాషలో నెనుబది రెం డార్యావృత్తములలో రచియింపఁ బడినది. దీనిని నన్నయభట్టీయ మని సాధారణముగా జనులు వాడుదురు. ఈ యాంధ్ర వ్యాకరణమున "కెలకూచి బాలసరస్వతి యను పండితుఁడు మొట్టమొదట తెలుఁగున టీక యొకటి వ్రాసెను. దానికి బాలసరస్వతీయ మని పేరు అటుతరువాత వాసుదేవుఁడను మఱియొక పండితుఁడీ వ్యాకరణమునకు వార్తిక మొక్కటి వ్రాసెను. దానిని వాసుదేవవృత్తి యని వ్యవహరింతురు. తదనంతరము కాకుసూర్యప్పకవి యీ వ్యాకరణమును దెనిఁగింపఁ బూని సంజ్ఞా సంధిపరిచ్చేదములను మాత్రము తెనుఁగున నయిదా శ్వాసములుగల పద్యకావ్యమునుగా రచించెను. ఈతనియనంతర మహోబలపండితుఁ డాంధ్రశబ్దచింతామణికి సంస్కృతభాషలో నొక వ్యాఖ్యానము చేసి దానికిఁ గవిశిరోభూషణ మని పేరుపెట్టెను. దానినిప్పు డహోబల పండితీయమని పిలుతురు. పిమ్మట నృసింహపండితుఁ డను నొకండుకూడ నన్నయభట్టీయమున కొక వ్యాఖ్యానము చేసెను. దానికి నృసింహ పండితీయమను నామము