45
నన్నయభట్టు
గ్రంథమును జూపి తనకు రాజసందర్శనము చేయింపమని వేఁడె ననియు, ఆ గ్రంథము సర్వోత్కృష్ణముగా నున్నందున దానిని ప్రకటనపఱిచినయెడల స్వగ్రంథ ప్రాశస్త్యము చెడు నవి యతఁడాలాగుననే యని చెప్పి త్రిప్పుచు నొకనాఁ డధర్వణాచార్యుఁడింట లేని సమయమునం దతఁడు బసచేసియున్న యింటివారికి లంచ మిచ్చి యాపుస్తకమును గాల్పించెననియు, ఇల్లు విడిచి పోవునప్ప డధర్వణాచార్యుఁడెవ్వరికో చూపుటకయి తనతోఁగూడఁ దీసికొని పోయిన విరాటపర్వమొక్క-టి మాత్రము నశింపక మిగిలె ననియు, ఈ దుర్నయము నన్నయభట్టువలన జరగిన దని తెలిసికొని యధర్వణా చార్యుఁ డాతనిని శపించుచు దుఃఖముతో లేచిపోయె ననియు, సాధుపురుషునకు నిష్కారణముగ ద్రోహము చేసిన చింతచేత నన్నయభట్టు మతిచెడి వెఱ్ఱివాడయి గ్రంధరచనకు సమర్ధుఁడు కాకపోయె ననియు చెప్పుదురు. కాని యీ కధ యెంత మాత్రము విశ్వాసార్థమయినది కాదు. అధర్వణా చార్యుఁడును నన్నయభట్టును సమకాలీనులని నిర్ణయించుటకుఁ దగిన నిదర్శనము లేవియుఁ గానరావు. అధర్వణాచార్యకృతమయిన వికృతి వివేక మను వ్యాకరణకారికావళిని నన్నయభట్టవిరచిత మనెడి యాంధ్ర శబ్దచింతామణిని విమర్శించి చూడఁగా నధర్వణాచార్యుఁడు నన్నయభట్టు నకుఁ దరువాతివాఁ డని యూహింపc దగియున్నది. అయినను ఈ యూహను వేఱువిధముగాఁ గూడ చేయవచ్చును. నన్నయభట్టారకుఁడు భారతము నారణ్యపర్వమువఱకును దెనిఁగించి కాలధర్మము నొందిన తరవాత తిక్కనసోమయాజి పూరింపఁ బూనుకొనకమునుపో, పూనుకొన్న సంగతి యెఱుఁగకమునుపో మిగిలిన భాగమును తా నాంధ్రీకరింపఁ బూని విరాటపర్వమును మాత్రమే చేసి యధర్వణాచార్యుఁడు తక్కినభాగమును ముగింపకయే లోకాంతరగతుఁ డయి యుండవచ్చును.
నన్నయభట్టు రచియించిన వన్న యితర గ్రంధములు లక్షణసార మను తెలుఁగుఛంద స్సొకటియు, ఆంధ్రశబ్దచింతామణి యనఁబడు తెలుఁగు వ్యాకరణ మొకటియు, ఇంద్రవిజయ మను గ్రంధము నొకదానినిఁగూడ నన్నయ రచియించిన ట్లానందరంగరాట్ఛందములో నుదాహరింపఁబడిన యొక