దూబగుంట నారాయణకవి
ఇతఁడు పంచతంత్రమును పద్యకావ్యమును రచియించి తమ్మభూపాలుని పుత్రుఁడైన బసవభూపాలుని కంకితము చేసెను. కృతిపతి పిలిపించి తన్నుఁ గూర్చి పలుకుట మొదలైన విషయములను పుస్తకములో కవి ఇట్లు చెప్పుకొని యున్నాడు.
చ. హరిహరభక్తు నార్యనుతు నాంధ్రకవిత్వవిశారదు న్మహే
శ్వరవరమాననీయుఁ గులవర్ధను శాంతుఁ బ్రబంధవాచకా
భరణము నాగమాంబికకు బ్రహ్మయమంత్రికి నాత్మసంభపున్
సరసుని దూబగుంటపురశాసను సారయనామధేయునిన్.
క. తలఁపించి హితులు చెప్పఁగఁ
బిలిపించి కవిత్వగోష్ఠిఁ బ్రియ మెసఁగంగాఁ
బలుకుచు నితాంతకాంతిం
దళుకొత్తంగ నంకురించు దరహాసమునన్.
క. తన ముఖచంద్రమరీచులు
జననయనచకోరములకు సాంద్రానందం
బొనరింప వేడ్క నన్నుం
గనుఁగొని యిట్లనియె వినయగౌరవ మెసంగన్.
చ. సురుచిరమైన నీ కవిత సూరిసభాంతరయోగ్యతామనో
హరసరసార్థగుంభనల నందము గావున నారనార్య సు
స్థిరమతిఁ గీర్తి నన్నొరయఁ జేసి సమస్తజగత్ప్రసిద్ధిమై
బరఁగుచునుండ మాకొక ప్రబంధ మొనర్పు ప్రియం బెలర్పఁగన్.
గీ. పంచతంత్రి యనఁగ నంచితగీర్వాణ
భాషమున్ను చెప్పఁబడినయట్టి
కావ్యమాంధ్ర భాషఁ గర్ణామృతంబుగాఁ
గూర్పవలయు నీదునేర్పు మెఱయ.