Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

630

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

పేర్కొనిన సర్వజ్ఞ సింగభూపాలుని కుమారుఁడనియు, అందువలన గౌరన కాలము 15వ శతాబ్దిపూర్వార్ధమనియు 'నవనాథచరిత్ర' పీఠికలో శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు చెప్పియున్నారు. ఈ మాధవనృపాలుడు గౌరన పెదతండ్రి మంత్రిత్వమును నెఱపిన మాధవనృపాలునకుఁ బితామహుఁడవి శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు భైరవకవికృత 'శ్రీరంగమాహాత్మ్యము' పీఠికలోఁ దెల్పియున్నారు. వెలుగోటివంశ చరితమునందుదాహరింపఁబడిన (ఉమామహేశ్వర) శాసనమునందలి 'శాకాఖ్యే' అను శ్లోకమునఁ బేర్కొనఁ బడిన మాధవనృపాలుఁడు తాతయు, నాగారవు మాధవనృపాలుఁడు మనుమఁడు నగుదురనియుఁ ఉమామహేశ్వర శాసనకర్తయగు మాధవ సృపాలుని యొద్దనే పోతరాజు క్రీ శ 1376 ప్రాంతమున మంత్రిగా నున్నందున, నాతని తమ్ముని కుమారుఁడగు గౌరనమంత్రి 1385 మొదలు 1445 వఱకు నుండి యుండునని నిశ్చయింపఁదగియున్నదని శ్రీ చాగంటి శేషయ్యగారు [ఆంధ్ర కవితరంగిణి' లో (సంపుటము 4, పుటలు 252. 263)] తెలిపియున్నారు.

గౌరనమంత్రి చేసిన రెండు ద్విపదకావ్యములలోను హరిశ్చంద్రోపాఖ్యానమొకటి యైనట్లీవఱకే చెప్పఁబడెను గదా ? హరిశ్చంద్రుని కథ వేదముల నాఁటినుండియు సుప్రసిద్దమయి యీ భరతఖండమునం దంతటను పండితులు మొదలుకొని పామరులవఱకును వ్యాపించి యున్నది. ఈ కథ సంస్కృతమున మార్కండేయపురాణములోను, స్కాందపురాణములోను జెప్పఁబడి యున్నది. కథ కొంతవఱకు రెండు పురాణములలోను సమానముగానే యున్నను గొన్ని చోట్ల జరిత్రాంశములలో మాత్రమేకాక పేరులయందు సహితము భేదించి యున్నది. మార్కండేయపురాణములో హరిశ్చంద్రుని భార్య పేరు శైబ్య యని యున్నది; స్కాందపురాణములో చంద్రమతి యని యున్నది. మార్కండేయపురాణములో హరిశ్చంద్రుఁడు భార్యాసహితముగా మృతపుత్రుని చితిలోఁ బడి చావఁబోవుచుండగా దేవతలు ప్రత్యక్షమయినట్లున్నది; స్కాందపురాణములో హరిశ్చంద్రుఁడు భార్య శిరస్సును చేతి ఖడ్గముతో నఱకఁబోవుచుండఁగా దేవతలు ప్రత్యక్షమయినట్టున్నది.