గంగనార్యుఁడు
ఈ కవి భాగవతమునందలి పంచమస్కంధము నాంధ్రీకరించెను. ఇతఁడు తన గ్రంథభాగమును శ్రీకృష్ణున కంకితము చేసెను. ఆశ్వాసాంతగద్యలలో 'ఇది శ్రీ సకల సుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన' అని మాత్రము చెప్పియుండుటచే నితనిం గూర్చిన విశేషము లేమియును దెలియరాకున్నవి. ఇతఁడు పోతన, నారయలకుఁ దర్వాతి వాఁడనియు, ఏర్చూరి సింగన సమకాలికుఁడనియు, నిజాం రాష్ట్ర నివాసి యనియు “ఆంధ్ర కవితరంగిణి' లోఁ గలదు. [సం. 6 పుట 21] పంచమస్కంధమును దాను పూర్తిగా వ్రాసినట్లు గంగనార్యుఁడు చెప్పికొనినను, పంచమాశ్వాసమునఁ బోతనామాత్యుని కవిత చాలగా నున్నదని 'ఆంధ్ర కవితరంగిణి' కారు లభిప్రాయపడుచున్నారు. (సం. 6 పుట. 212)
శ్రీధరుఁడు
శ్రీధరుఁడొక ఛందస్సును రచించినట్లు తెలియుచున్నది. లక్షణ గ్రంథములలో శ్రీధర చ్ఛందస్సులోని పద్యములు, దీని ప్రస్తావన కానవచ్చుచున్నవి. అప్పకవి శ్రీధరుని పేర్కొనుటచే నితఁ డప్పకవికంటెఁ బూర్వుఁడనవలెను. శ్రీధరచ్ఛందస్సునకు పిన్నయ సోమభూపాలుడు కృతిపతియని యొక పద్యమువలనఁ దెలియవచ్చుచున్నది. గౌరన తన లక్షణదీపికలో శ్రీధర ఛ్ఛందస్సునుండి యుదాహరించినట్లొక వ్రాత ప్రతి వలనఁ దెలియవచ్చుచున్నది. అది వాస్తవమైనచో నితఁడు 14 శతాబ్ది చివఱనుండెనని తలంప వచ్చును. లేదా 15 శతాబ్దిలో నుత్తరార్థమున నుండెనని యనుకొనవచ్చును.