Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెలిగందల నారయ


ఇతఁ డాంధ్రమహాభాగవతమునందలి యేకాదశ, ద్వాదశ స్కంధములను, దశమస్కంధోత్తరభాగములోని చివఱిభాగమును రచించెను. స్కంధముల చివఱి గద్యలనుబట్టి యితఁడు పోతనామాత్యుని శిష్యుఁడైనట్లు తెలియుచున్నది. ఇతఁడు దశమస్కందోత్తరభాగము చివఱి గద్యలో మాత్రము తన గురువునందలి గౌరవముచే, పోతనామాత్యుఁడే వ్రాసినట్లు చెప్పెను.

భాగవతమును పూర్తిగా పోతన రచించెననియు. నందలి భాగములు కొన్ని శిథిలములు కాఁగా, నారయాదులు పూరించిరనియుఁ గొంద ఱ౦దురు. అది సరికాదు. పోతన విడిచిన భాగమునే యీతఁడు రచించెనని తెలియుచున్నది. హరిభట్టు రచించిన పద్యములు కొన్ని యీతని ఏకాదశ, ద్వాదశస్కంధము లలోఁ గానవచ్చుచున్నవి. లేఖకుల ప్రమాదమున నవి యిందు చేరి యుండును.

సదానందయోగి


ఇతనిం గూర్చి 'ఆంధ్ర కవితరంగిణి' లోఁ గొంత వ్రాయబడిఁ యున్నది. దానిని బట్టి యీతఁడు 'నవ్యతంభోగి శ్రీ సదానందయోగి' అను మకుటముతో నొక శతకమును వ్రాసినట్లును. ఇతఁడు ఫణిభట్టునకు గురువై యుండ వచ్చునని యూహింపవీలున్నట్లును తెలియుచున్నది. శతకకవుల చరిత్ర వ్రాసిన శ్రీ వంగూరి సుబ్బారావుగారు నిట్లే యూహించినారు !