పుట:Aandhrakavula-charitramu.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

610

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

     
      డాయఁ గాయంబు విద్యున్నికాయోపమేయంబు ప్రాయంబు
      ధారాధరచ్ఛాయ మెన్నే నుపాయంబులన్ విత్త మాయత్తముం
      జేయుమా రిక్థవారంబు వేరంబు గా దీ విచారంబు వంశానుచారంబు
      సంసారసారంబు లాభాధికారంబు........

దండకము తుద నీ క్రింది పద్యము చేర్పఁబడి యున్నది

  ఉ. పండితకీర్తనీయుఁడగు బమ్మెర పోతన యాసుధాంశుమా
      ర్తాండకులాచలాంబునిధితారకమై విలసిల్ల భోగినీ
      దండకము న్రచించె బహదానవిహర్తకు రావు సింగభూ
      మండలభర్తకు న్విమతమానవనాథమదాపహర్తకున్.

చిలుకూరి వీరభద్రరావుగారు 1916 వ సంవత్సరమునందుఁ బ్రకటించిన యాంధ్రుల చరిత్రము మూఁడవభాగమునందు “ఈ పై నుదహరింపఁబడిన పద్యము బమ్మెరపోతన రచించినది గాక మఱియొకరు రచించినట్లు "పండితకీర్తనీయుఁడగు బమ్మెరపోతన" యని ప్రథమ పురుషములో నుడివిన పలుకే సాక్ష్య మిచ్చుచున్నది. పండితకీర్తనీయుఁడ నని బమ్మెర పోతనవంటి భక్తా గ్రేసరుఁడగు కవి యాత్మ శ్లాఘనీయమగు విశేషణము వ్రాసికొనునా ? యని సంశయింపఁదగి యున్నది" అని వ్రాసిరి. భోగినీ దండకము బమ్మెర పోతరాజకృతము కాదని చూపఁదలఁచినవారయి తమ యభిప్రాయమును సాధించుట కయి వీరభద్రరావుగారు రెండు హేతువులను జూపిరి. వానిలో నొకటి పద్యములో బమ్మెర పోతన యని ప్రథమ పురుషములో నుడువుట, రెండవది పండితకీర్తనీయుఁడని యాత్మశ్లాఘన ముండుట. ఈ రెండు ను హేతువులని చెప్పఁదగినవే కావు. కంఠోక్తిగాఁ జెప్పఁబడిన యంశమును కాదని కొట్టివేయుటకు నమోఘములైన ప్రబల హేతువు లుండవలెను గాని దుర్బలములయిన హేత్వాభాసములు పనికిరావు. కవులు తమ్ముఁగూర్చి ప్రథమపురుషములోఁ జెప్పుకొనుట సర్వసాధారణమని భాషాజ్ఞానము గల బాలురకు సహితము తెలియును. ఈ క్రింది యుదాహరణములను జూడుఁడు