పుట:Aandhrakavula-charitramu.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

606

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

“నాల్గవ యాశ్వాసములోని పద్యములు కొంచెము నీరసములుగా నున్నవి. ఇది యేమని యాలోచించుచుండ వీరభద్రవిజయము తాటియాకుల ప్రతి యొకటి లభించె. దానిఁ బరికించి చూడ నాల్గవ యాశ్వాసము ముద్రితపాఠముకంటె సర్వదాభిన్నమయి శివపార్వతీకైలాసవిహారవర్ణనమును కుమార జననమును, దారకాసురసంహారమును దెలుపు కథాభాగము విస్తరించునదిగా నున్నది. నూతనముగా లభించిన యీభాగమునను పూర్వాశ్వాసములలో వలెనే మహర్షులకు వాయుదేవుఁడీ కధ చెప్పినట్లున్నది. ఆశ్వాసాం తమునఁ గొన్ని పత్రములు లేనందున నీ భాగము పోతనకృతమగునా ? కాదా ? యనువంశము స్పష్టముగాఁ జెప్పుటకు వీలులేకపోయినను. గవిత్వ ధోరణి ననుసరించియుఁ గధానుస్యూతత్వమును జూచియు నిదిపై మూఁడా శ్వాసములకు సంబంధించి యేకకవికృతమని తోచుచున్నది. ముద్రితమగుభాగము పరకవిపూరితమగుటచేఁ గాఁబోలు నుత్పలమాలతోఁ బ్రారంభింప బడియె.... ... ... "

శ్రీకవిగారి యొద్దనున్న తాళపత్ర ప్రతిని నేను జూచుట తటస్థింపలేదు ముద్రిత ప్రతిలోని నాల్గవ యాశ్వాసమునకు బదులుగా నీ తాళపత్ర ప్రతియందున్న గ్రంధము నాల్గవ యాశ్వాసముగా నుండఁదగుననియు, ముద్రిత ప్రతియందలి నాల్గవ యాశ్వాస మైదవయాశ్వాసము గాఁదగుననియు నిశ్చ యింపవలసి యున్నది. అట్లు కాదేని గ్రంథమునకు వీరభద్రవిజయమను పేరు సార్ధకముగాకపోఁగాఁ గుమారసంభవమని పేరు పెట్టవలసియుండును. ముద్రిత ప్రతియందలి నాల్గవ యాశ్వాసమును దీసివై చినచోఁ దక్కిన గ్రంధములో వీరభద్ర ప్రశంసయే యుండదు ముద్రితప్రతి నాల్గవ యాశ్వాసములోని పద్యములు నీరసముగా నున్నవని శ్రీకవిగారనుచున్నారు. కానీ నా కట్లు తోఁచుటలేదు. భాగవతములోని కవిత్వమునుబట్టి చూచినప్పు డిది కొంత నీరసముగాఁ గనుపట్టినను, వీరభద్రవిజయమందలి తక్కిన భాగములతో పోల్చి చూచినప్పుడిది నీరసముగాఁ గాన్పింపదు.”]

[కవితరంగిణి సం. 6, పుటలు. 193, 194]